జగన్‌ను తుగ్లక్ 2.O అనేది ఇందుకే: చంద్రబాబు

ఇది రాక్షస రాజ్యమా, ఆటవిక రాజ్యమా, కిరాతక రాజ్యమా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేవాళ్లు లేక అగమ్యగోచరంలో ఉందని అన్నారు.

Update: 2020-12-23 15:45 GMT

వైసీపీ నాయకుల కన్నుపడ్డ భూమి గల్లంతే అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. భూబకాసురుల్లా మారిన వైసీపీ నాయకులు.. ''భూరక్ష-భూహక్కు'' అని అనడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అని విమర్శించారు. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మట్టిలో సగం పైగా కప్పెట్టే సరిహద్దు రాళ్లకు గ్రానైట్ రాళ్లు, వాటిపై జగన్ ఫొటోలా అని అన్నారు.

జగన్‌ను తుగ్లక్ 2.O అనేది ఇందుకే అని ఎద్దేవా చేశారు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో వైసీపీ ప్రజలకు దూరమైందని విమర్శించారు. మెజారిటీ ఉందని విర్రవీగితే ఆ పొగరును ప్రజలే దించేస్తారని విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు ఈ 20నెలల్లోనే ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని ఆరోపించారు.

ఇది రాక్షస రాజ్యమా, ఆటవిక రాజ్యమా, కిరాతక రాజ్యమా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేవాళ్లు లేక అగమ్యగోచరంలో ఉందని అన్నారు. సీఎం జగన్ రైతు వ్యతిరేక చర్యల వల్లే వెయ్యి 29మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలవడానికి జగన్ నిర్వాకాలే కారణమని అన్నారు.

భూములు, పంటలు కాపాడుకోడానికి రైతుల ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారని తెలిపారు. రైతుకోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులు, రైతుకూలీలకు శ్రేణులు అండగా ఉండాలని సూచించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించాలని చెప్పారు. బాధిత రైతు కుటుంబాల్లో మనోధైర్యం పెంచాలని, వైసీపీ రైతు వ్యతిరేక చర్యల్ని ప్రజల్లో ఎండగట్టాలని అన్నారు.

Tags:    

Similar News