AP: వైసీపీ నేత సీదిరి అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు.. పోలీసులకు కంప్లైంట్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష;

Update: 2024-07-14 04:00 GMT

వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సీదిరి అప్పలరాజు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరుతూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో శనివారం సీఐ విజయానంద్‌కు ఫిర్యాదు అందజేశారు. ప్రజా సమస్యలు చర్చించే శాసనసభలో అప్పలరాజు నోరు పారేసుకున్నారని అన్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదని ఒక వైద్యుడిగా ధ్రువీకరిస్తానని అప్పలరాజు అప్పుడు అన్నారు. జగన్‌ ప్రాపకం కోసం చంద్రబాబును ఆసుపత్రికి పంపి మానసిక పరిస్థితి బాగైన తరువాతే అసెంబ్లీలోకి అడుగు పెట్టించాలని కూడా అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అప్పలరాజుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కక్ష సాధింపులొద్దు: చంద్రబాబు

అధికారంలోకి వచ్చేశామన్న గర్వంతో ఎవరిపైనా దాడులకు ఎవరూ దిగొద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులు, నేతలకు కీలక సూచన చేశారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. అధికారంలో ఉన్నామని మనం కూడా దాడులు చేస్తే వైసీపీకీ, మనకీ తేడా ఉండదని చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిద్దామని పేర్కొన్నారు. టీడీపీ నేతలపై దాడులు చేసినవారి సంగతి చట్టపరంగా తేలుద్దామన్నారు. అధికారంలోకి వచ్చామని నేతలు అలసత్వం ప్రదర్శించొద్దనీ, మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచుగా రావడం సేవగా భావించాలని సూచించారు. ప్రతిరోజూ ఇద్దరు మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మంత్రుల్ని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యతను జోనల్‌ ఇన్‌చార్జులు తీసుకోవాలన్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చే వినతుల్ని స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు మంత్రులంతా బాధ్యత తీసుకోవాలని కోరారు.

కార్యకర్తలు, ప్రజల నుంచి విజ్ఞాపన స్వీకరణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఏసీ సీఎం చంద్రబాబు సూచించారు. దీనికోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమర్థులందరికీ నామినేటెడ్‌ పదవులు దక్కుతాయని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారి గురించి ఐదు రకాలుగా సమాచార సేకరణ చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ స్థాయి నుంచి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సమాచారం తీసుకుంటున్నామని వివరించారు.

Tags:    

Similar News