TG: తెలంగాణలో రేవంత్‌ పెట్టుబడుల వేట

బిజీబిజీగా గడుపుతున్న ముఖ్యమంత్రి... శంతను నారయణన్‌తో భేటీ;

Update: 2024-08-10 04:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి.. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని పిలుపునిస్తున్నారు. ఇకపై తెలంగాణను ‘ఫ్యూచర్‌ స్టేట్‌’ అనే ట్యాగ్‌ లైన్‌తో పిలుద్దామని రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హబ్‌, నెట్‌ జీరో సిటీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో ఫ్యూచర్‌ స్టేట్‌కు తెలంగాణ పర్యాయ పదంగా నిలుస్తుందని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. కాలిఫోర్నియాలో ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ నిర్వహించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. టెక్‌ యూనికార్న్‌ సీఈవోలను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.


ఐటీ యూనికార్న్‌ ప్రతినిధులను తెలంగాణకు ఆహ్వానించారు. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చదిద్దుకుందామని సీఎం పిలుపునిచ్చారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి రాయితీలు ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోబ్​ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌తో భేటీ అయ్యారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అడోబ్​ సీఈవోతో సమావేశంలో సీఎంతో పాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను నారాయణ్​ ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు. టెక్ విజనరీ శంతను నారాయణ్ను కలుసుకోవటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News