TEMPLES: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిటకిటలాడుతున్న ఆలయాలు

త్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు

Update: 2025-12-30 02:00 GMT

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీమహా విష్ణువు దర్శనానికి తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. విజయవాడ కనకదుర్గ ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రస్వామి వారు, గజ వాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి దర్శనమిచ్చారు. విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనం వైభవోపేతంగా ప్రారంభమైంది. సింహాద్రి నాథుడు వైకుంఠ నారాయణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, సినీనటుడు చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు, నారా రోహిత్‌ దంపతులు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, క్రికెటర్‌ తిలక్‌ వర్మ, సినీ నిర్మాత డీవీవీ దానయ్య, భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణా ఎల్లా, తితిదే బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా దర్శించుకున్నారు.

ఉత్తర ద్వార దర్శన సమయం, పూజా నియమాలు

ఈ ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేశారని, పాలకడలి నుంచి అమృతం పుట్టిందని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ రోజు ఆచరించే అత్యంత ముఖ్యమైన విషయం ఉత్తర ద్వార దర్శనం! ఈ పర్వదినాన ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటే, జన్మజన్మల పాపాలు తొలగిపోయి... పుణ్యలోకాలు, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తాయని ప్రతీతి. అంతేకాదు, నియమ నిష్ఠలతో వ్రతం ఆచరించిన వారికి మరో జన్మంటూ ఉండదని, మోక్షం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి.

వైకుంఠ ఏకాదశి రోజున మీరు తప్పక చేయాల్సిన పనులు ఏంటంటే..

ఉపవాసం, జాగరణ ఆచరించడం. శ్రీమహావిష్ణువు, వేంకటేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకోవడం.గీతా పారాయణం, గోవింద నామ స్మరణ చేయడం ఇవేవీ చేయలేకపోయినా.. కనీసం "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో... వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున 3:30 గంటల నుంచే వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. ఈసారి డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు, పది రోజుల పాటు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనున్నారు. దర్శన టోకెన్ల కోసం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని... డ్రా ద్వారా ఉచిత సర్వదర్శనం టోకెన్లు పొందవచ్చు. అలాగే, తమిళనాడులోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో 21 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని వజ్రాభరణాలతో అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకొచ్చి భక్తులకు దర్శనం కల్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చే శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం... ఈ వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకోండి. మోక్షాన్ని, అఖండ ఐశ్వర్యాన్ని పొందండి.

Tags:    

Similar News