Tirupati Stampede: బాధితులను పరామర్శించిన టీటీడీ ఛైర్మన్

ప్రమాదవశాత్తు జరిగిందన్న బీఆర్ నాయుడు;

Update: 2025-01-09 03:30 GMT

తొక్కిసలాట ఘటనలో గాయపడి రుయా, స్విమ్స్ ఆస్రత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గురువారం ఉదయం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అటు తొక్కిసలాట ఘటన జరిగిన బైరాగిపట్టెడ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఎలాంటి కుట్ర లేదని.. ఇది ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు గురువారం ఉదయం పరామర్శకు వస్తారని.. మృతులకు సంతాపం తెలపడం సహా క్షతగాత్రులను పరామర్శిస్తారని తెలిపారు. మృతుల కుటుంబాలకు కూడా పరిహారం ప్రకటించనున్నట్లు చెప్పారు.

వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులొస్తారని తెలిసీ.. అందుకు తగ్గట్లు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో విఫలమైన అధికారులపై తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునస్సమీక్షించాలని ఆదేశించారు. విశాఖపట్నంలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలోనే ఇలాంటి విచారకర ఘటన జరగడం తీవ్రంగా బాధించిందన్నారు. క్షతగాత్రుల్ని పరామర్శించేందుకు గురువారం చంద్రబాబు తిరుపతి వెళ్లనున్నారు. ఘటన సమాచారం తెలిసినప్పటి నుంచి ఆయన తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు, తితిదే అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనాస్థలికి వెళ్లి క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారుల్ని ఆదేశించారు.

Tags:    

Similar News