VINAYAKA CHAVITHI: వాడవాడలా కొలువుదీరిన గణపయ్య
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఆరంభమైన గణేష్ నవరాత్రులు;
తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో గణపయ్యలు కొలువుదీరారు. మండపాల్లో విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణనాథులు భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్నా భక్తులు వినాయక దర్శనానికి పోటెత్తారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవం 2025 ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తైన విశ్వశాంతి మహా శక్తి గణపతి విగ్రహాన్ని భక్తుల కోసం కొలువు దీర్చారు.
ఈ భారీ విగ్రహం హైదరాబాద్‌లో గణేష్ చతుర్థి ఉత్సవాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. లక్షల మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ సంవత్సరం ఉత్సవం విశ్వశాంతి థీమ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది ప్రపంచ శాంతి, ఆధ్యాత్మిక సామరస్యాన్ని సూచిస్తోంది. ఈ ఉత్సవం 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1954లో స్వాతంత్ర్య సమరయోధుడు శంకరయ్య ఒక అడుగు ఎత్తైన విగ్రహంతో ప్రారంభించిన ఈ సంప్రదాయం ఇప్పుడు భారీ రూపం దాల్చింది.
ఖైరతాబాద్ గణేశుడి సన్నిధిలో మహిళ ప్రసవం
ఖైరతాబాద్ గణేశ్ 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు మొదటి రోజు మహా గణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పోలీసులు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనం కోసం రాజస్థాన్‌కు చెందిన రేష్మ అనే మహిళ క్యూలైన్లో నిల్చుంది. అప్పటికే ఆమె గర్భవతి కావడంతో నొప్పులతో.. క్యూ లైన్లోనే పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం ఆమెను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన చూసిన భక్త జనాలు.. వినాయకుడి కృపతోనే తల్లిబిడ్డ క్షేమంగా బయటపడ్డారని స్వామి వారిని కొనియాడుతున్నారు.
రేవంత్‌రెడ్డి గెటప్‌లో వినాయకుడు
హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నగరంలోని అన్ని వీధుల్లో గణాధిపతులు కొలువు దీరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో కూడా వినాయకుడు కొలువు దీరడం ఈసారి హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నగరంలోని గోషామహల్ నియోజకవర్గంలోని అఘపురలో తెలంగాణ రైజింగ్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడిని రూపొందించారు.