Visakhapatnam Bride Death: పెళ్లి ఆపాలనుకుంది.. ప్రాణమే పోగొట్టుకుంది.. సృజన కేసు మిస్టరీ వీడింది..

Visakhapatnam Bride Death: నవ వధువు సృజన నిజంగానే విషం తీసుకుంది అని పోలీసులు వెల్లడించారు.

Update: 2022-05-23 10:15 GMT

Visakhapatnam Bride Death: విశాఖలో పెళ్లికూతురు సృజన ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. సృజన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. ఓవైపు పెళ్లి రోజు దగ్గర పడుతున్నా సరే.. ఎలాగైనా పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి హామీ ఇచ్చింది సృజన. ఈ ప్లాన్‌లో భాగంగా గన్నేరుపప్పు తినింది. కొద్దిగా గన్నేరు పప్పు తీసుకుని, ఆత్మహత్యయత్నం చేస్తే పెళ్లి ఆగిపోతుందని సృజన ప్లాన్ చేసింది. అయితే, ఊహించని విధంగా సృజన చనిపోయింది.

పరవాడలో ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే తోకాడ మోహన్‌తో సృజనకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ తరువాత హైదరాబాద్ వెళ్లినా ప్రేమ కొనసాగింది. ఇంతలో సృజనకు పెళ్లి నిశ్చయించారు తల్లిదండ్రులు. అయితే, తనకు సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి కొంత సమయం పడుతుందని, కొంతకాలం నిరీక్షణ తప్పదని మోహన్ చెప్పుకొచ్చాడు. దీంతో పెళ్లిని ఆపేందుకు సూసైడ్ అటెంప్ట్‌ చేద్దామనుకుంది సృజన.

సృజన ఆత్మహత్య మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ఆమె కాల్‌ లిస్ట్‌ బయటకు తీశారు. పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసింది. ఆ చాటింగ్‌లో పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి ప్రామిస్‌ చేసిందని పోలీసులు చెబుతున్నారు. అనుకున్న ప్లాన్‌ ప్రకారం గన్నేరు పప్పు తెచ్చుకుని తినేసింది. ఈనెల 11న రాత్రి పెళ్లి పీటలపై కుప్పకూలడంతో.. పెళ్లివాళ్లంతా కలిసి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సృజన చనిపోయింది.

పెళ్లి అలసట కారణంగా గుండెపోటు వచ్చి ఉంటుందని అందరూ అనుకున్నారు. పైగా పెళ్లి సమయంలో సృజనకు కొద్దిగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, ఆ కారణంగానే చనిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దలు చూసిన సంబంధానికి సృజన ఒప్పుకుందని, తన ఇష్టప్రకారమే పెళ్లి జరిపిస్తున్నామని చెప్పుకొచ్చారు.

ప్రేమ వ్యవహారం, బలవంతపు పెళ్లి ఆరోపణలను ఖండించారు. కాని, సృజన బాడీలో విషపదార్ధాలు ఉన్నట్లు డాక్టర్లు ప్రైమరీ ఎగ్జామినేషన్‌లో చెప్పడంతో.. పోలీసులు సృజన ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషించారు. చివరికి ప్రేమ వ్యవహారం కారణంగా, పెళ్లి ఆపే ప్రయత్నంలో ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసుల విచారణలో తేలింది.

Tags:    

Similar News