అందుకే ఆ శవాన్ని మోశాను.. ఎస్సై శిరీష మాటల్లో!
ఖాకీలంటే అంటే కఠినంగా ఉండేవారని అన్నది చాలా మంది అభిప్రాయం.. కానీ వారిలోనూ మానవత్వం ఉంటుంది. మంచి పనులతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. ఔరా అనిపించుకుంటారు.;
ఖాకీలంటే అంటే కఠినంగా ఉండేవారని అన్నది చాలా మంది అభిప్రాయం.. కానీ వారిలోనూ మానవత్వం ఉంటుంది. మంచి పనులతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. ఔరా అనిపించుకుంటారు. ఆ కోవాలోకే వస్తారు ఎస్సై శిరీష.. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు సమీపంలో ఓ గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. అయితే దీనిపైన సమాచారం అందుకున్న ఎస్సై శిరీష ఆ ఘటన స్థలానికి చేరుకొని ఆ శవాన్ని తన భుజాలపైన కి.మీ మేర వరిపొలాల గట్ల పైన మోసుకెళ్ళి ఆ అనాధశవానికి అంత్యక్రియలు జరిగేలా చేసింది. దీనితో ఎస్సై శిరీషను సోషల్ మీడియా వేదికగా చాలా మంది అభినందించారు.
అయితే తాజాగా ఈ ఘటన పైన ఎస్సై శిరీష మాట్లాడుతూ... తానూ ఆ శవాన్ని మోయడానికి గల కారణాలను వెల్లడించింది. " అడవికొత్తూరు అనేది ఓ మారుమూల ప్రాంతం. అక్కడికి వాహనాలు వెల్లవు.. అక్కడో అనాధశవం ఉందని తెలియగానే నేను, ఓ కానిస్టేబుల్, హోంగార్డు అక్కడికి చేరుకున్నాం. అక్కడికి వెళ్లి చూడగా.. ఓ గోతిలో 70 ఏళ్లు పై బడిన వృద్ధుని శవం కనిపించింది. అయితే అతన్ని బయటకు తీసేందుకు ఎవరు కూడా ముందుకు రాలేదు.. భయపడ్డారు కూడా.
అయితే అలా భయపడేవారికి కనువిప్పు కావాలనే ఉద్దేశంతో.. నేను కాశీబుగ్గలో ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్ భాగస్వామ్యంతో స్ట్రెచర్ తీసుకురమ్మని చెప్పాను. స్ట్రెచర్‌పై నేనే శవాన్ని ఉంచి మరొక వ్యక్తి సహాయంతో కిలోమీటరు మేర వరి పొలాల గట్లపై శవాన్ని మోశాను. నా దృష్టిలో శివుడైనా, శవమైనా ఒక్కటే.. ఇది నా డ్యూటీ" అంటూ ఎస్సై శిరీష చెప్పుకొచ్చింది. తానూ చేసిన ఈ పనికి స్వయంగా డీజీపీ గౌతం సవాంగ్ ఫోన్ చేసి అభినందించారని.. అలాగే హోంమంత్రి సుచరిత, తెలంగాణ పోలీసులు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మొదలగు వారు అభినందించారని వెల్లడించింది. ఆ అభినందనలను తానూ ఎప్పటికి మర్చిపోలేనని తెలిపింది.