YCP: వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌కు 6 నెలల జైలు శిక్ష
విశాఖ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ కు జైలు శిక్ష పడింది. ఆత్మహత్యాయత్నం కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ రైల్వే కోర్టు తీర్పు ఇచ్చింది. గుడివాడ అమర్‌నాథ్ 2016 ఏప్రిల్‌లో విశాఖపట్నంలో రైల్వే జోన్ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో అమర్ ఆరోగ్యం క్షీణించడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటి టూటౌన్ పోలీసులు అమర్‌నాథ్‌పై పోలీసులు ఆత్మహత్యాయత్నం నేరం కింద కేసు నమోదుచేశారు. అయితే ఈ కేసులో అమర్‌పై నేరం రుజువు కావడంతో రైల్వే కోర్టు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పుపై గుడివాడ అమర్‌నాథ్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
ఈ కేసులో నేరం రుజువైందని భావించిన రైల్వే కోర్టు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి, అమర్‌నాథ్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పుతో రాజకీయ వర్గాల్లో చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. అయితే, ఈ నిర్ణయంపై అమర్‌నాథ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తాను ప్రజా ప్రయోజనాల కోసం చేసిన నిరసనను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. తాను ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తానని కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 2006లో విశాఖపట్నంలో కార్పొరేటర్‌గా విజయం సాధించారు. అనంతరం 2011లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అనకాపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2014లో ఎంపీగా పోటీ చేసి ఓడిన ఆయన, 2019లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే, 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.