Vinukonda Case: వినుకొండలో దారుణహత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన
యువకుడి రెండు చేతులు నరికి దారుణంగా;
బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కే.శ్రీనివాసరావు స్పందించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని అన్నారు.
ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలు వల్ల మాత్రమే ఈ హత్య జరిగిందని, ఈ హత్య కు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కాగా హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ విధించామని వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు.
కాగా ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా షేక్ రషీద్ అనే యువకుడు ముండ్లమూరు బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బయటకు వస్తుండగా... అదే సమయంలో హతుని మాజీ మిత్రుడు, పట్టణానికి చెందిన షేక్ జిలానీ కత్తితో రషీద్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతలు, తల, మెడపై కత్తితో కొట్టాడు. రషీద్ చెయ్యి తెగి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనను హత్యారాజకీయం చేయాలని భావించిన విపక్ష వైసీపీ.. ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయంటూ ప్రచారానికి దిగింది. సోషల్ మీడియా వేదికగా ఫేక్ పోస్టులు పెడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్పందించారు.
ఖండించిన టీడీపీ..
వినుకొండలో దారుణ హత్య ఘటనపై విపక్ష వైసీపీ విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ స్పందించింది. పొద్దున్నే 3 గంటలకు ఫోన్ చేసి బాబాయ్‌ని చంపేసి.. చంద్రబాబు చంపాడని పేపర్‌లో వేసిన నీచ చరిత్ర వీళ్లదని టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏది జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే పనిగా పెట్టుకున్నారని మండిపడింది.