Chandrababu Cabinet : బాబు క్యాబినెట్‌లో యువ గళం
మంత్రివర్గం కూర్పులో స్పెషల్ మార్క్;
ప్రభుత్వానికి ఫ్రెష్ లుక్ ఇవ్వడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం క్యాబినెట్‌ని యువరక్తంతో నింపేసింది. ప్రాంతాలు, వర్గాల వారీగా సమతూకం పాటిస్తూనే.. యువతకు, మహిళలకు అగ్రతాంబూలం అదించింది. మరోవైపు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి పార్టీకి వెన్నెముకలా నిలిచిన బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించింది. ఇన్ని సమీకరణాల మధ్య చాలామంది సీనియర్లకు మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. ప్రభుత్వానికి కొత్తరూపు తెచ్చేందుకు తెదేపా సాహసోపేత నిర్ణయం తీసుకుందని... పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఉరకలెత్తే యువరక్తం, సామాజిక సమతూకం, అన్ని వర్గాలు, ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం, రాజకీయ ప్రత్యర్థుల్ని దీటుగా ఎదుర్కొనేవారికి గుర్తింపు, ఇలా రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ కొత్త మంత్రివర్గం నవ యువశక్తితో, కొత్త రూపుతో కళకళ్లాడుతోంది. పాలనలో ఉత్సాహంతోపాటు తెలుగుదేశం పార్టీకి యువరక్తాన్ని ఎక్కించి మరో 30 - 40 ఏళ్లపాటు తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ఎంతో జాగ్రత్తగా మంత్రివర్గాన్ని ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. తెదేపా ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మంత్రివర్గం అంటే సాధారణంగా యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి సీనియర్లే కనిపించేవారు. కానీ అలాంటి సీనియర్లు లేని మంత్రివర్గాన్ని మొదటిసారి చూస్తున్నాం..! వారితో పాటు మరి కొందరు సీనియర్లకూ వివిధ కారణాలు, సమీకరణాల వల్ల ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి. 1983 నుంచి ఇప్పటి వరకు తెదేపా అధికారంలోకి వచ్చాక.. స్పీకర్‌గా పనిచేసిన కాలంలో తప్ప, మంత్రివర్గంలో యనమల లేకపోవడం ఇదే మొదటిసారి. అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు కూడా మెజార్టీ సందర్భాల్లో మంత్రులుగా ఉన్నారు. ఈసారి అలాంటి పాతవారిని క్యాబినెట్‌లోకి తీసుకోకుండా, మంత్రివర్గానికి పూర్తిగా కొత్త రూపు ఇవ్వాలన్న పార్టీ అధినేత నిర్ణయం వెనుక.. దీర్ఘకాల వ్యూహం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ప్రస్తుత క్యాబినెట్‌లోని.. 24 మందిలో తొలిసారి మంత్రులైనవారు 17 మంది ఉన్నారు. అంతేకాదు.. తొలిసారి ఎన్నికైనవారు 10 మంది ఉన్నారు. ఎనిమిది మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీకి అవకాశమిచ్చారు. వైశ్యుల నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించారు. నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్లకు చోటిచ్చారు. ముగ్గురు మహిళలకు అవకాశమివ్వడంతో పాటు, వారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయడంతో రెండు విధాలుగా ప్రాధాన్యమిచ్చినట్టయింది. జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌ను, భాజపా నుంచి సత్యకుమార్‌ని క్యాబినెట్‌లో చేర్చుకోవడంతో పాటు తెదేపా నుంచి తీసుకున్న 20 మందిలోనూ అత్యధికులు కొత్తవారు, యువత కావడంతో.. ప్రభుత్వం నవయవ్వన రూపం సంతరించుకుంది.