YS JAGAN: అయ్యవారి.. ప్రయాణాల విలాసాలు
జగన్ విమాన ఖర్చులపై కలకలం.... రూ.222 కోట్ల ఖర్చు అన్న టీడీపీ... ప్రజా ధనం దుర్వినియోగంపై విమర్శలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పదవీకాలంలో తన విమాన ప్రయాణాల కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ. 222 కోట్లు ఖర్చు చేసినట్టుగా వెల్లడి కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మంత్రి నారా లోకేష్ టార్గెట్‌గా వైసీపీ చేస్తున్న విమర్శలకు ఈ సమాచారంతో టీడీపీ కౌంటర్ అటాక్ చేసింది. ఇది ఏపీలో వైఎస్ జగన్, నారా లోకేష్ విమాన ప్రయాణాల కోసం చేసిన ఖర్చులపై అటు టీడీపీ, ఇటు వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఏపీ మంత్రి మంత్రి నారా లోకేష్ వీకెండ్స్‌లో తరచుగా హైదరాబాద్‌కు వెళ్తున్నారని, ఇందుకోసం చార్టర్డ్ విమానాలను ఉపయోగిస్తున్నారని... తద్వారా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే కొడమల సురేష్ అనే వ్యక్తి... నారా లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో విమాన ప్రయాణాల ఖర్చులకు సంబంధించి ఆర్టీఐ ద్వారా వివరాలు అడగ్గా, లోకేష్ విమాన ప్రయాణాలకు శాఖాపరంగా ఎలాంటి ఖర్చులు చెల్లించలేదని ప్రభుత్వం తెలిపింది. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, సమాచార సాంకేతికత, రియల్-టైమ్ గవర్నెన్స్ శాఖలను కలిగి ఉన్న మంత్రి లోకేష్... మంత్రిగా తన 77 హైదరాబాద్ ట్రిప్పులకు తన జేబు నుంచి చెల్లించారని పేర్కొంది.
జగన్ కే చుట్టుకున్న ఉచ్చు
టీడీపీ ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ షాకింగ్ గణాంకాలను బహిర్గతం చేసింది. 2019 నుండి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమాన ప్రయాణానికి ప్రభుత్వం రూ.222.85 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో 2019-20లో రూ.31.43 కోట్లు, 2020-21లో రూ.44 కోట్లు, 2021-22లో రూ.49.45 కోట్లు, 2022-23లో రూ.47.18 కోట్లు, 2023-24లో రూ.50.81 కోట్లు. ఫిక్స్డ్-వింగ్ విమానాలకు రూ.112.50 కోట్లు, హెలికాప్టర్లకు రూ.87.02 కోట్లు, సిబ్బంది, నిర్వహణ వంటి నిర్వహణ ఖర్చులకు రూ.23.31 కోట్లు ఖర్చు చేసినట్లు డేటాలో ఉంది. జగన్ తక్కువ దూరాలకు కూడా హెలికాప్టర్లపై ఆధారపడతారని ప్రజలకు ఇప్పటికే తెలుసు. కొన్నిసార్లు నాలుగు కిలోమీటర్ల వరకు కూడా. ఈ వాస్తవాలు ఉన్నప్పటికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికీ నారా లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుంది.