YSRCP Water Grid Scam: వాటర్‌ గ్రిడ్‌ పనుల్లోనూ అవినీతే

అర్హత లేని సంస్థలకు అప్పనంగా పనులు

Update: 2024-06-01 03:15 GMT

వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలు ఇప్పటికీ ఒక్కొక్కటీ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇష్టారాజ్యంగా ప్రజల సొమ్మును దోచుకున్నారు. వాటర్‌గ్రిడ్‌ పనుల్లో దాదాపు 426 కోట్ల అక్రమ భాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. వాటర్ గ్రిడ్ టెండర్లలో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లు అడ్డగోలుగా వ్యవహరించి గుత్తేదారులకు మేలు చేశారు. జలజీవన్‌ మిషన్‌లో భాగమైన 8,690 కోట్ల విలువైన వాటర్‌ గ్రిడ్‌ పనులను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుకూల గుత్తేదారలకు కట్టబెట్టడమే కాకుండా ప్రభుత్వ సొమ్ము లూటీ చేశారు. విజయవాడకు చెందిన ఓ న్యాయవాది ఆర్టీఐ కింద సేకరించిన సమాచారంతో రెండేళ్ల క్రితం జరిగిన భాగోతం బయటపడింది. అర్హతలేని సంస్థలకు పనులు అప్పగించడం దగ్గర నుంచి...ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు నేరుగా సమర్పించినా అధికారులు నోరుమెదపలేదు.

జల్‌జీవన్‌ మిషన్ కింద ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ప్రజలకు తాగునీటి సరఫరా కోసం 8,690 కోట్ల అంచనాతో వాటర్‌ గ్రిడ్‌ పనులకు టెండర్లు పిలిచారు. అంచనా విలువ కన్నా 4.91 శాతం అదనపు మొత్తానికి పనులు దక్కించుకున్నాయి. దీంతో అదనంగా 426.67 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. గుత్తేదారు సంస్థల అర్హతలు, పనుల నిర్వహణకు ఉన్న సాంకేతిక అనుభవం తదితర నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు పట్టించుకోలేదు. రివర్స్ టెండర్‌ ద్వారా తక్కువ ధరకే పనులు అప్పగిస్తామని ప్రగల్బాలు పలికిన జగన్..అంచనా విలువ కన్నా దాదాపు 5శాతం అదనంగా టెండర్లు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి.

జాయింట్‌ వెంచర్‌లో లీడ్‌ భాగస్వామిగా ఉన్న సంస్థకు ప్రతిపాదిత పైపులైన్ల ఏర్పాటులో 51శాతం పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధనను పట్టించుకోకుండానే టెండర్లు వేశారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో లీడ్‌ భాగస్వామికి బదులుగా జాయింట్‌ వెంచర్‌లోని మరో సంస్థకు అనుభవం ఉన్నట్లుగా చూపారు. నిబంధనల ప్రకారం ఇది చెల్లుబాటు కాదు. అయినప్పటికీ పనులు అప్పగించేశారు. ప్రతి డాక్యుమెంట్‌నూ ఆన్‌లైన్‌లో విధిగా అప్‌లోడ్‌ చేయాలన్న నిబంధనను గుత్తేదారు సంస్థలు ఉల్లంఘించినా టెండర్‌ కమిటీ అడ్డగోలుగా ఆమోదించింది. టెండర్లు వేసే గుత్తేదారు సంస్థలపై క్రిమినల్‌ కేసులు లేనట్లుగా, దేశంలో ఎక్కడా ప్రభుత్వశాఖలు ఇదివరకు బ్లాకు లిస్ట్‌లో చేర్చనట్లుగా, బ్యాంకుల్లో దివాలా కేసులు పెండింగ్‌లో లేనట్లుగా స్వీయ ధ్రువీకరణ పత్రాలను కూడా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అయితే కొన్ని గుత్తేదారు సంస్థలు ఫిజికల్‌గా అందజేశాయి. తాగునీటి సరఫరా పనుల నిర్వహణలో ఇదివరకు ఉన్న అనుభవంపైనా ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయకపోయినా అధికారులు పట్టించుకోలేదు. పనుల నిర్వహణకు అవసరమైన యంత్రాలు సొంతంగా కలిగి ఉన్నారా? లీజుకు తీసుకున్నారా అనే దానిపైనా సరైన వివరాలు ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా వేసిన టెండర్లపై కొన్ని జిల్లాల్లో ఇంజినీర్లు మదింపు చేసే సందర్భంలో లోపాలు గుర్తించారు. వీటిని ఎత్తిచూపుతూ పంపిన నివేదికలను ఉన్నత స్థాయిలో పక్కన పెట్టారు. జిల్లా పర్యవేక్షక ఇంజినీర్‌ పంపిన మదింపు నివేదికను చీఫ్‌ ఇంజినీర్‌ పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఇంజినీరింగ్‌ ఇన్‌ చీఫ్‌కు నివేదించాలి. కొన్ని గుత్తేదారు సంస్థలు నిబంధనల ప్రకారం డాక్యుమెంట్లు దాఖలు చేయడంలో విఫలమైనా సీఈ స్థాయిలో అభ్యంతరం చెప్పలేదు. అలాగని ENCకూడా ప్రశ్నించలేదు. రాష్ట్రస్థాయి టెండర్‌ కమిటీ కూడా టెండర్లను ఆమోదించింది. దీంతో నిర్దేశిత పత్రాలు లేకపోయినా సులువుగా కొన్ని సంస్థలు టెండర్లు దక్కించుకోగలిగాయి.

Tags:    

Similar News