వైకాపా నేతలు అధికార మదంతో అర్చకులపై దాడులకు తెగబడుతుండటంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ దాడులకు పాల్పడుతుండటంపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా కాకినాడలో ఘటనతో వైకాపా నేతల తీరు మరోసారి చర్చనీయాంశమైంది.
అర్చకులు, పురోహితులపై వైకాపా నేతలు రౌడీల్లా దాడులకు తెగబడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అధికారగర్వంతో అర్చకులను దుర్భాషలాడుతూ, దాడులు చేస్తున్నారు. ఇలా జరిగినప్పుడల్లా అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణ సంఘాలు రోడ్డెక్కి నిరసన తెలిపినా అధికార పార్టీ నేతల్లో మార్పు లేదు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నాలే చేస్తుండటంతో ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోటదాడులు జరుగుతూనే ఉన్నాయి. రెండురోజుల క్రితం కాకినాడలోని పురాతన శివాలయంలో వైకాపా నాయకుడు మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు... ఇద్దరు అర్చకులపై దాడిచేయడంతో మరోసారి అధికార పార్టీ నేతల తీరు చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల అర్చక, బ్రాహ్మణ సంఘాలు దీనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో 2020 నవంబరులో పూజారులపై ఆలయ ఛైర్మన్ తదితరులు చర్నాకోలాతో వాతలు పడేలా కొట్టారు. కార్తికపౌర్ణమి రోజున టికెట్ల ద్వారానే కాకుండా, భక్తులకు ఉచిత దర్శనాలకూ అవకాశం ఇవ్వాలని ఆలయ పూజారులు చక్రపాణిశర్మ, సుధాకర్‌శర్మ, మురుగు ఫణిశర్మ సూచించారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఆయన సోదరుడు, వారి అనుయాయులు కలిసి.. పూజారులపై దాడిచేశారు. ఉత్సవాల్లో వినియోగించే చర్నాకోలాతో పూజారులను ఇష్టానుసారం కొట్టారు. ఆలయ ఛైర్మన్‌తో రాజీనామా చేయించి వదిలేశారు. అటెండర్లుగా పనిచేసే ఈశ్వరయ్య, నాగరాజులను సస్పెండ్ చేసినా, మళ్లీ కొంత కాలానికే నాగరాజుకు వేరొక ఆలయంలో పోస్టింగ్ ఇచ్చారు.
పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయంలో సహాయ అర్చకుడు నాగేంద్ర పవన్‌పై ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ భర్త యుగంధర్... గతేడాది ఆగస్టులో దాడిచేశారు. అంతరాలయంలో అడ్డుగా నిలబడి ఉన్న యుగంధర్‌ను పక్కకు జరగాలని చెప్పినందుకు.. దురుసుగా వ్యవహరించి, దాడిచేసి, మెడలోని జంధ్యాన్ని తెంచేశారు. ఆలయ ఛైర్మన్‌తో... ఆ పదవికి రాజీనామా చేయించి సరిపెట్టారు.
గుంటూరులోని గోరంట్లలో పద్మావతీ ఆండాళ్ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు సాయిచరణ్‌పై గతేడాది సెప్టెంబరులో అధికారపార్టీ నేత, ఆలయ కమిటీ కార్యదర్శి మేడా సాంబశివరావు, మేనేజర్ లక్ష్మీనారాయణ దాడిచేశారు. సెలవు కావాలని అడిగినందుకు దూషించి, కర్రతో దాడిచేయడంపై అర్చకుడు సాయిచరణ్ సెప్టెంబరు 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో ఆ నెల 28 వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. వైకాపా నేతలను అరెస్టు చేయాలంటూ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేయడంతో చివరకు కేసు నమోదుచేసి, ఇద్దరినీ అరెస్టు చేశారు. అర్చకుల విషయంలో దేవాదాయశాఖ అధికారులు కూడా చులకనగా వ్యవహరిస్తు వారిని వేధించే ఘటనలు ఎక్కువగానే ఉన్నాయి.