YSRCP: వైఎస్సార్సీపీలో చిచ్చురేపుతున్న నియోజకవర్గాల బాధ్యుల మార్పు

కొనసాగుతున్న మూకుమ్మడి రాజీనామాస్త్రాలు

Update: 2024-01-04 01:30 GMT

నిరసనలు..ధర్నాలు..రాస్తారోకోలు..నియోజకవర్గాల సమన్వయ కర్తల మార్పుతో అధికార వైకాపాలో రేగిన కలకలం ఇది. సిటింగులకే టికెట్లు ఇవ్వాలంటూ మద్దతుదారులు..ధిక్కార స్వరం పెంచుతున్నారు. మూకుమ్మడి రాజీనామాస్త్రాలు సంధిస్తున్నారు.

అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పులతో....... వైకాపాలో అసమ్మతి సెగ రేగింది. ఇన్నాళ్లూ పార్టీకోసం పని చేస్తే...... ఇప్పుడు ఎవరో కొత్తవారిని తీసుకువచ్చి సమన్వయకర్తలు అంటే సరేనంటూ తలలు ఊపేయాలా అంటూ నేతలు... తమ కేడర్‌తో నిర్వహించిన అంతర్గత భేటీల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నేతలు... తమ వర్గీయులతో ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టించి నిరసన వ్యక్తం చేయిస్తున్నారు. మరికొందరి వర్గీయులు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

నియోజకవర్గాల మార్పు, టికెట్‌ నిరాకరణ సెగ జగన్‌కు తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు MLAలు...కాకినాడలో బుధవారం నిర్వహరించిన సభకు మొహం చాటేశారు.పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. ఇద్దరూ కాకినాడలో జరిగిన సభకు దూరంగా ఉన్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. మాధవికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతునిచ్చేదే లేదని స్పష్టంచేస్తున్నారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ఇన్చార్జిగా మాధవి నియామకాన్ని నిరసిస్తూ అరకు ఎంపీపీ ఉషారాణి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

విజయవాడ పశ్చిమలో కాదని... విజయవాడ సెంట్రల్‌కు మార్చడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. బుధవారం ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని..తన వర్గీయులతో టికెట్ మార్పుపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు టికెట్ లేకుండా పోయిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మద్దతుగా ఆయన వర్గీయులు, కొందరు కార్పొరేటర్లు సమావేశమయ్యారు. కో ఆప్షన్ సభ్యుడొకరు రాజీనామా చేశారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈసారి ఎమ్మిగనూరులో చేనేతకే టికెట్ ఇస్తా.. మీరే ఎవరో ఒకరిని తీసుకురండి అని సీఎం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే... మాచాని వెంకటేష్‌ తీసుకొచ్చి సీఎంకు పరిచయం చేయడం, ఆయన్ను సమన్వయకర్తగా ఖరారు చేయడం జరిగిపోయాయి. అయితే వెంకటేష్‌ను ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డి వ్యతిరేకించారు. M.L.A. వయోభారం వల్ల నియోజకవర్గంలో ఆయన కుమారుడు అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. ఎమ్మిగనూరులో బుధవారం రెండుచోట్ల జరిగిన పించన్ల పంపిణీ కార్యక్రమాల్లో మాచని వెంకటేశ్‌తో కలిసి MLA పాల్గొన్నప్పటికీ ఆయన కుమారుడు దూరంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు టికెట్‌ను చెన్నకేశవరెడ్డికి కానీ జగన్మోహన్రెడ్డికి కానీ ఇవ్వాలని లేకపోతే రాజీనామాలు చేస్తామని ఎంపీపీ కేశన్న, సర్పంచులు వెంకట్రామిరెడ్డి, దేవేంద్రగౌడ్, రంగస్వామి, విరుపాక్షరెడ్డి, భీమిరెడ్డి, కోటేకల్ లక్ష్మన్న ఎంపీడీవో కార్యాలయంలో ప్రకటించారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్థానంలో శాంతను..... సమన్వయకర్తగా నియమించారు.  

Tags:    

Similar News