ycp : బూతు నేతలకు పోలింగ్ బూతు లోనే దెబ్బ
రాజకీయ విమర్శ శ్రుతిమించితే భరించలేమని జనం తీర్పు
వైకాపా బూతు నేతలకు పోలింగ్ బూత్‌ల్లోనే ఓటర్లు బుద్ధి చెప్పారు. పాడు నోళ్లకు ఓటమితోనే తాళం వేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ అనిల్ కుమార్ యాదవ్, అంబటికి రాంబాబు వంటి నాయకుల్ని.. మరోసారి అసెంబ్లీకి రావొద్దని తీర్పుచెప్పారు
కొన్ని లక్షల మంది ప్రతినిధిగా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నామనే విచక్షణ కోల్పోయి, బూతు పురాణం ప్రవచించిన వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజలు కీలెరిగి వాతలు పెట్టారు. జగన్‌ను పొగడడం, విపక్షాలపై నోరుపారేసుకోవడం, దాడులు చేయడమే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పదవులకు ప్రమాణాలని కొత్త నిర్వచనాలు సూత్రీకరించిన నేతాగణాన్ని ఓటర్లు తరిమికొట్టారు. మైకు ముందుకొస్తే చెవులు మూసుకునే అసభ్య పదజాలాన్ని ప్రయోగించే కొడాలి నానిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు! ఆసెంబ్లీలోనూ బూతులు మాట్లాడి చివరికి 'బూతుల మంత్రిగార బిరుదు సంపాదించుకున్న నానిని నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకున్నారు! కొడాలి నానీ టీవీలో మాట్లాడుతున్నారంటే ఆ తిట్లు వినలేక టీవీ ఛానల్ మార్చాల్సిన పరిస్థితి. రాజకీయ విమర్శ శ్రుతి మించి, బూతుగా మారితే భరించలేరన్న నిజాన్ని గుడివాడ ప్రజలు నిరూపించారు.
ఇక కొడాలి నాని దోస్త్ వల్లభనేని వంశీనీ గన్నవరం ఓటర్లు ఛీకొట్టారు. కన్నతల్లి లాంటి తెలుగుదేశంపై కత్తి గట్టి ఆ పార్టీ కార్యాలయంపై దాడులు చేయించి, రాజకీయ బిక్ష పెట్టిన చంద్రబాబు భార్యపైనా ఆనుచిత వ్యాఖ్యలు చేశారు. గన్నవరం నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదమన్నట్లు నిరంకుశంగా శాసించారు. చివరకు ఓటరు తీర్పు చూసి, గన్నవరం నుంచి పలాయనం చిత్తగించారు. నిత్యం ఎవరో ఒకర్ని తిడితేగానీ నోటి తీట తీరని జోగి రమేశ్‌కూ ఓటమి తప్పలేదు. జగన్ దృష్టిలో ఎక్కడ వెనుకబడతానో అన్నట్లుగా సహచర మంత్రుల ముందే నోరు పారేసుకునో జోగి రమేశ్ ఈసారి కృష్ణా జిల్లా పెడన నుంచి పెనమలూరుకు మారారు. అక్కడి ప్రజలూ ఆయన్ను తిరస్కరించారు. అనుచరులను వెంటేసుకొని చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రగా వెళ్లిన జోగికి జగన్ మంత్రి పదవి కానుకగా పడేశారు. కానీ పెనమలూరు ఓటర్లు మాత్రం ప్రజాస్వామ్యంలో తిట్లు, దాడులకు స్థానం లేదని తీర్చిచ్చారు. ఇక తోటి ఆడవాళ్లూ అసహ్యించుకునే ప్రవర్తనతో చెలరేగిన మంత్రి రోజా తగిన మూల్యం చెల్లించుకున్నారు. మంత్రిననే మర్యాదమరచిపోయి, చిన్న,పెద్ద అనే తేడా లేకుండా నోరుపారేసుకునే రోజాను ఓటర్లు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు.