నాకప్పుడు 14 ఏళ్లు.. అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు: ఆమిర్ కూతురు ఐరా

కోరిక తీర్చుకోవడం ఒక్కటే పనిగా పెట్టుకుంటున్నారు.. మృగాల్లా మారి ..

Update: 2020-11-03 07:38 GMT

ఆడపిల్ల కనబడితే ఆబగా చూస్తున్నారు.. వావి వరుసలు, వయసు తారతమ్యాలు అన్నీ మరచి పోతున్నారు.. కోరిక తీర్చుకోవడం ఒక్కటే పనిగా పెట్టుకుంటున్నారు.. మృగాల్లా మారి అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలను క్షణికానందం కోసం ఛిధ్రం చేస్తున్నారు. ఒక వర్గం వారే ఇలాంటి అత్యాచారాలకు, అరాచకాలకు బలైపోతున్నారని అనుకోవడానికి లేదు. తాజాగా బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కూతురు ఐరా తనపై జరిగిన లైంగిక దాడిని గురించి వివరిస్తూ ఆవేదన చెందింది.

తన మానసిక ఒత్తిడికి గల కారణాలు వివరిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. తనకి 14 ఏళ్ల వయసున్నప్పుడు ఓ వ్యక్తి తనపై లైంగిక దాడి చేశాడని పేర్కొంది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో కూడా తనకు తెలిసేది కాదని చెప్పింది. చిన్న వయసు కావడంతో అర్థం చేసుకోలేకపోయానని వెల్లడించింది. కానీ ఆ మరుసటి ఏడాది ఆ విషయం తెలుసుకొని తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు తనను ఆ సమస్య నుంచి బయటపడేశారని తెలిపింది.

తన తల్లిదండ్రులు రీనా-ఆమిర్‌లు విడాకులు తీసుకునేటప్పుడు తాను చాలా చిన్నదాన్ని అని.. అయితే ఆ విషయం తనను ఎప్పుడూ బాధపెట్టలేదని వివరించింది.. అమ్మానాన్న విడిపోయినా స్నేహితుల్లా కలిసే ఉన్నారని చెప్పింది. తమది బ్రోకెన్ ఫ్యామిలీ కాదని పేర్కొంది. ఆరేళ్ల వయసులో క్షయ వ్యాధి వచ్చినప్పుడు కూడా అంత బాధపడలేదని.. కానీ 14 ఏళ్ల వయసులో జరిగిన లైంగిక వేధింపుల తాలూకు అనుభవించిన బాధను మరిచి పోవడానికి ఏడాది సమయం పట్టిందని తెలిపింది. పిల్లలకు తల్లిదండ్రుల సంరక్షణ అవసరం అనేది అప్పుడు అర్థం చేసుకున్నానని ఐరా ఖాన్ పేర్కొంది. ప్రస్తుతం ఆ మానసిక క్షోభ నుంచి బయటపడి ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పింది.

Tags:    

Similar News