ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు జగన్‌ సర్కారు మెలిక

Update: 2023-06-06 04:30 GMT

రెగ్యూలరైజ్‌ చేయాల్సిన కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు జగన్‌ సర్కారు మెలికపెడుతోంది. ఎన్నికలకు ముందు ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తామని హామీలు గుప్పించారు జగన్‌. కానీ ఇప్పుడు ఈ సంఖ్యను తగ్గేంచేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. 2014 జూన్‌ 2నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని మాత్రమే క్రమబద్ధీకరిస్తామని మంత్రుల కమిటీ ప్రకటించింది. అయితే తెలంగాణలో 2014 జూన్‌ 2నాటికి పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్‌ చేశారు. కానీ ఏపీలో మాత్రం ఉమ్మడి ప్రభుత్వంలో నియామకాలు పొందినవారినే రెగ్యులరైజ్‌ చేస్తామనే నిబంధన పెట్టారు. తెలంగాణలో అమలుచేసిన విధానాన్నే అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు. రాష్ట్ర విభజన సమయానికి ఎంతమంది పని చేస్తున్నారో అందరినీ రెగ్యులరైజ్‌ చేయాలంటున్నారు.

అన్ని విభాగాల్లో కలిపి ఒప్పంద ఉద్యోగులు సుమారు 60వేల మంది వరకు పని చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోని వారినే పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో 20 వేల 79 మంది ఒప్పంద ఉద్యోగులే ప్రభుత్వ లెక్కల్లోకి వస్తున్నారు. కొత్త నిబంధన ప్రకారం వీరిలో ఏడు వేలలోపు ఉద్యోగులే రెగ్యులరైజ్‌ అయ్యే పరిస్థితి ఉంది. ప్రాజెక్టులు, కార్పొరేషన్లు, సొసైటీల్లోని వారి జాబితాను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. అత్యధికంగా వైద్య, ఆరోగ్యశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్‌లో కలిపి 19వేల మంది వరకు ఒప్పంద ఉద్యోగులున్నారు. ఆ తర్వాత విద్యాశాఖలో ఎక్కువగా ఉన్నారు.

Similar News