దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారు నగలకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. అధిక రేట్ల కారణంగా ఇటీవల బంగారానికి డిమాండ్ తగ్గింది. రెండు వేల నోట్లను ఆర్బీఐ రద్దు చేయడంతో మళ్ళీ బంగారానికి డిమాండ్ పెరిగింది. అనేక నగరాల్లో బంగారం కొనేందుకు జనం బంగారు దుకాణాల్లో క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ముంబైలో అనేక బంగారు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి నోట్ల కౌంటింగ్ మిషన్లకు పని పెరిగింది. నల్లధనాన్ని బంగారం రూపంలో మార్చుకోవడం ఎప్పటి నుంచో జరుగుతోంది.
బంగారానికి డిమాండ్ పెరగడంతో షాప్ యజమానులు ప్రీమియం పెంచినట్లు గెలుస్తోంది. భారీ కొనుగోళ్ళకు పాన్ నంబర్ పేర్కొనడం తప్పనిసరి కావడంతో... షాప్ యజమానులు ఇతర మార్గాల్లో బంగారాన్ని సరఫరా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవ ధర కంటే పది శాతంపైగా ప్రీమియం వసూలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల డాలర్ బలపడటంతో బులియన్ ధరలు తగ్గాయి. దీంతో బంగారం రూపంలో తమ నల్లధనాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నోట్ల రద్దు సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనా... ఈసారి రద్దీ తక్కువగా ఉందని ముంబై వ్యాపార వేత్తలు అంటున్నారు. ఇక జవేరి మార్కెట్‌లో కూడా ఆదివారం కూడా హడావుడి కన్పిస్తోంది.
రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి సంబంధించి ఆర్బీఐ నుంచి అధికారికంగా మార్గదర్శకాలు రావాల్సి వచ్చింది. అవి వచ్చిన తరవాత బులియన్ మార్కెట్‌లో హడావుడి పెరగొచ్చని తెలుస్తోంది. బులియన్‌తో పాటు అధిక విలువగల లగ్జరీ వస్తువుల కూడా డిమాండ్ పెరగనుంది. రెండు లక్షల రూపాయలు దాటిన వస్తువుల కొనాలంటే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది ఇతరుల పేర్లతో వీటిని కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న మొత్తాల మార్పిడి పెద్ద సమస్య కాదని... పెద్ద మొత్తాలు దాచుకున్నవారు... ముఖ్యంగా నల్లధనం కూడబెట్టినవారు ఇపుడు తమ కరెన్సీని మార్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఐటీ అధికారులు నిబంధనలను కఠినం చేయడంతో బ్లాక్‌ను వైట్‌గా మార్చడం కూడా కష్టమౌతోంది. అయినా... బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ప్రీమియంతో నడుస్తోంది. అనేక షాపులు తాము రెండు వేల నోట్లను తీసుకుంటామని యాడ్స్ ఇస్తున్నాయి. సాధారణ కొనుగోలుదారులు కూడా వెంటనే కొనాలంటే ప్రీమియం ధర చెల్లించాల్సి వస్తోంది. పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఇటువంటి సమయంంలో పెద్ద నోట్లను ఉపసంహరించడంతో బులియన్ మార్కెట్ ధగధగలాడుతోంది.