Bike Sales : జనవరిలో బైక్‌ల జాతర.. హీరో స్ప్లెండర్ నంబర్ వన్.. టీవీఎస్ అపాచీ జోరు అదిరింది.
Bike Sales : భారత టూ వీలర్ మార్కెట్‌లో బైక్‌ల సందడి మామూలుగా లేదు. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి (2026) నెలలో టూ వీలర్ విక్రయాలు అదిరిపోయాయి. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కమ్యూటర్ సెగ్మెంట్ బైక్‌లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. గతేడాది జనవరితో పోలిస్తే, ఈ ఏడాది టాప్-10 మోడళ్ల విక్రయాలు ఏకంగా 20.27 శాతం వృద్ధి సాధించాయి. గత నెలలో మొత్తం 9,02,096 బైక్‌లు అమ్ముడయ్యాయంటే జనం ఏ రేంజ్‌లో షోరూమ్‌ల బాట పట్టారో అర్థం చేసుకోవచ్చు.
ఎప్పటిలాగే భారత రోడ్లపై కింగ్ అనిపించుకుంటున్న హీరో స్ప్లెండర్ మరోసారి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2026 జనవరిలో ఈ ఒక్క మోడల్ ఏకంగా 3,24,019 యూనిట్లు అమ్ముడై రికార్డు సృష్టించింది. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 2.59 లక్షల బైక్‌లతో పోలిస్తే ఇది 24.90 శాతం పెరుగుదల. సామాన్యుడికి నమ్మకమైన నేస్తంగా మారిన స్ప్లెండర్, మైలేజీలోనూ, మెయింటెనెన్స్‌లోనూ తనకు సాటిలేదని మరోసారి నిరూపించుకుంది.
ఇక రెండో స్థానంలో హోండా కంపెనీకి చెందిన హోండా షైన్ నిలిచింది. గత నెలలో 1,61,224 షైన్ బైక్‌లు అమ్ముడయ్యాయి. అయితే గతేడాది జనవరిలో అమ్ముడైన 1.68 లక్షల బైక్‌లతో పోలిస్తే విక్రయాల్లో స్వల్పంగా (4.20%) తగ్గుదల కనిపించడం గమనార్హం. అయినా కూడా 125cc సెగ్మెంట్‌లో షైన్ తన హవాను కొనసాగిస్తూనే ఉంది.
యూత్ ఫేవరెట్ బజాజ్ పల్సర్ మూడో స్థానంలో నిలిచి సత్తా చాటింది. గత నెలలో 1,29,600 పల్సర్ బైక్‌లు రోడ్డెక్కాయి. గతేడాది కంటే ఈసారి విక్రయాలు 24.52 శాతం పెరగడం విశేషం. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్ కోరుకునే వారు పల్సర్‌కు జై కొడుతున్నారు. దీని తర్వాత నాలుగో స్థానంలో హీరో కంపెనీకే చెందిన హెచ్‌ఎఫ్ డీలక్స్ నిలిచింది. గత నెలలో ఈ బైక్ 71,690 యూనిట్లు అమ్ముడై 15 శాతం వృద్ధిని నమోదు చేసింది.
టాప్-5లో ఆఖరి స్థానాన్ని టీవీఎస్ అపాచీ దక్కించుకుంది. మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో అపాచీ దూకుడు మామూలుగా లేదు. గతేడాది జనవరిలో కేవలం 34,511 బైక్‌లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది జనవరిలో ఏకంగా 51,191 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే దాదాపు 48.33 శాతం పెరుగుదల కనిపించింది. స్పోర్ట్స్ లుక్ కోరుకునే యువత ఇప్పుడు అపాచీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి బైక్ మార్కెట్‌లో ఈ ఏడాది జోరు బాగా కనిపిస్తోంది.