AADHAR: గూగుల్‌ మ్యాప్స్‌లో ఇక 'ఆధార్‌' సేవలు

గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులోకి ఆధార్‌ వివరాలు- ఉడాయ్- గూగుల్ ఒప్పందం

Update: 2026-02-27 03:30 GMT

ఆధార్‌ కార్డులో మార్పులు చేయించాలన్నా లేదా కొత్తగా ఆధార్‌ నమోదు చేసుకోవాలన్నా.. ఇకపై గల్లీల వెంట తిరుగుతూ కేంద్రాల కోసం వెతకాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, మీ ఇంటికి దగ్గరలో ఉన్న అధీకృత ఆధార్‌ కేంద్రం ఎక్కడుందో ఇట్టే తెలిసిపోతుంది. వినియోగదారుల సౌకర్యార్థం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ కేంద్రాల వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఒక్క క్లిక్‌తో పూర్తి సమాచారం

గూగుల్‌ మ్యాప్స్‌లో కేవలం కేంద్రం చిరునామా మాత్రమే కాకుండా, అక్కడ లభించే సేవల వివరాలను కూడా పొందుపరచనున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలకు సమయం వృథా కాకుండా ఉంటుంది. ప్రధానంగా ఈ క్రింది వివరాలు మ్యాప్స్‌లో కనిపిస్తాయి.

నమోదు సేవలు:

కొత్తగా ఆధార్‌ తీసుకోవాలనుకునే పెద్దలు, చిన్నారుల కోసం ఎన్‌రోల్‌మెంట్ సౌకర్యం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

అప్‌డేషన్ వివరాలు:

చిరునామా (Address), మొబైల్‌ నంబర్‌ మార్పు వంటి సేవలు ఏయే కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయో ముందే చూసుకోవచ్చు.ఏ కేంద్రం ఏ సమయంలో పనిచేస్తుంది, సెలవు దినాలు ఎప్పుడనేది కూడా స్పష్టంగా ఉంటుంది.

దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత

కేంద్రాల భౌతిక స్థితిగతులపై కూడా ఉడాయ్‌ దృష్టి సారించింది. ఆధార్ కేంద్రం వద్ద దివ్యాంగులకు అనువైన సదుపాయాలు (Ramps మొదలైనవి) ఉన్నాయా? వాహనాల కోసం పార్కింగ్ సదుపాయం ఉందా? అనే కీలక సమాచారాన్ని కూడా గూగుల్ మ్యాప్స్‌లో పొందుపరుస్తున్నట్లు ఉడాయ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దీనివల్ల వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు తమకు అనువైన కేంద్రాన్ని సులువుగా ఎంచుకునే వీలుంటుంది.

తప్పుడు సమాచారానికి చెక్

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చాలాచోట్ల అనధికారిక లేదా మూతపడిన ఆధార్ కేంద్రాల వివరాలు కనిపిస్తుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొత్త విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 60 వేల అధీకృత కేంద్రాల ఖచ్చితమైన సమాచారాన్ని నేరుగా గూగుల్ మ్యాప్స్‌లో చూసుకోవచ్చని ఉడాయ్‌ సీఈఓ భువనేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని నివారించి, పారదర్శకతను పెంచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు.

త్వరలో 'అపాయింట్‌మెంట్' సదుపాయం

వచ్చే కొన్ని నెలల్లోనే ఈ సేవలు గూగుల్ మ్యాప్స్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. అంతటితో ఆగకుండా, భవిష్యత్తులో గూగుల్ మ్యాప్స్ ద్వారానే నేరుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించే దిశగా ఉడాయ్‌ అడుగులు వేస్తోంది దీనివల్ల కేంద్రాల వద్ద క్యూ లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా, నిర్ణీత సమయంలో వెళ్లి పని పూర్తి చేసుకోవచ్చు. డిజిటల్ ఇండియా దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఆధార్ సేవలను గూగుల్ మ్యాప్స్‌తో అనుసంధానించడం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

Tags:    

Similar News