Pulsar 180 vs Apache RTR 180 : పల్సర్ 180 రిటర్న్.. అపాచీ ఆర్‌టీఆర్ 180 కోటను బద్ధలు కొడుతుందా?
Pulsar 180 vs Apache RTR 180 : భారతదేశపు మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ పల్సర్ నుంచి ఒక అదిరిపోయే వార్త వచ్చింది. బజాజ్ ఆటో తన పవర్‌ఫుల్ మెషీన్ బజాజ్ పల్సర్ 180ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెట్టింది. 2022లో నిలిపివేసిన ఈ మోడల్‌ను ఇప్పుడు మళ్ళీ లాంచ్ చేయడంతో 180cc సెగ్మెంట్‌లో పోటీ ఆసక్తికరంగా మారింది. దీనికి ప్రధాన ప్రత్యర్థి ఎప్పటిలాగే టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 180. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ బైక్ కొంటే వాల్యూ ఫర్ మనీ? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇంజిన్, పెర్ఫార్మెన్స్
కొత్త బజాజ్ పల్సర్ 180లో 178.6cc సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 17 hp పవర్, 15 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 180లో 177.4cc ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది కూడా 17 hp పవర్ ఇస్తుంది కానీ, టార్క్ విషయంలో 15.5 Nmతో కొంచెం ముందంజలో ఉంది. పేపర్ మీద చూస్తే అపాచీ కొంచెం పవర్‌ఫుల్‌గా అనిపించినా, సిటీలో రోజూ వాడటానికి పల్సర్ చాలా స్మూత్‌గా, సౌకర్యవంతంగా ఉంటుంది. రెండు బైకుల్లోనూ 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
బరువు, హ్యాండ్లింగ్
ఇక్కడ టీవీఎస్ అపాచీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అపాచీ బరువు కేవలం 140 కేజీలు మాత్రమే, అంటే పల్సర్ (156 కేజీలు) కంటే 16 కేజీలు తక్కువ. దీనివల్ల ట్రాఫిక్‌లో అపాచీని మలుపులు తిప్పడం చాలా సులభం. అపాచీలో గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm ఉంటే, పల్సర్‌లో 165 mm మాత్రమే ఉంది. ఇది గుంతల రోడ్లపై అపాచీకి ప్లస్ పాయింట్. అయితే, లాంగ్ రైడ్స్ వెళ్ళే వారికి పల్సర్ లోని 15 లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్ ఒక వరప్రసాదం (అపాచీలో 12 లీటర్లే ఉంటుంది).
ఫీచర్లు, టెక్నాలజీ
ఫీచర్ల విషయంలో అపాచీ ఒక అడుగు ముందే ఉంది. ఇందులో స్పోర్ట్, అర్బన్, రైన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, ఇవి వాతావరణానికి తగ్గట్టుగా బైక్ కంట్రోల్‌ను మారుస్తాయి. అదనంగా, బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్, ట్రాఫిక్‌లో క్లచ్ వాడకుండా నెమ్మదిగా వెళ్ళే GTT టెక్నాలజీ అపాచీలో ఉన్నాయి. పల్సర్ 180 విషయానికి వస్తే, ఇందులో ఇప్పుడు డిజిటల్ కన్సోల్, ఎల్ఈడీ లైటింగ్ ఇచ్చారు. పల్సర్ ఎప్పుడూ తన సింప్లిసిటీకి, రఫ్ అండ్ టఫ్ బాడీకి పేరుగాంచింది.
ధర, తుది నిర్ణయం
ధర విషయానికి వస్తే, బజాజ్ పల్సర్ 180 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.22 లక్షలుగా ఉండగా, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 180 ధర రూ.1.26 లక్షలుగా ఉంది. మీకు తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ రేంజ్, చూడటానికి భారీగా ఉండే బైక్, కంఫర్ట్ కావాలంటే పల్సర్ 180 బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా లైట్ వెయిట్, అదిరిపోయే ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీ, మంచి పికప్ కావాలనుకుంటే అపాచీ ఆర్‌టీఆర్ 180 వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు.