Airline Fine : విరిగిన సీట్లు, మురికి టాయిలెట్లు.. విమానయాన సంస్థకు రూ.1.5 లక్షల షాక్.

Update: 2026-02-25 06:15 GMT

Airline Fine : విమాన ప్రయాణం అంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని అందరూ ఆశిస్తారు. కానీ, లక్షల రూపాయలు చెల్లించి టికెట్ కొన్నా కూడా నరకప్రాయమైన అనుభవం ఎదురైతే ఎలా ఉంటుందో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి, అతని కుమార్తెకు ఎదురైన సంఘటన నిరూపిస్తోంది. న్యూయార్క్ వెళ్లే విమానంలో సరైన సదుపాయాలు కల్పించని కారణంగా సదరు ఎయిర్‌లైన్ సంస్థకు రూ.1.5 లక్షల జరిమానా విధిస్తూ న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ సంచలన తీర్పు ఇచ్చింది.

అసలు ఏం జరిగింది?

వివరాల్లోకి వెళ్తే.. ఒక తండ్రి, కుమార్తె కలిసి 2023 సెప్టెంబర్ 6న న్యూయార్క్ వెళ్లడానికి మేక్ మై ట్రిప్ ద్వారా ఎకానమీ క్లాస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇందుకోసం వారు రూ.2,73,108 ఖర్చు చేశారు. అదనంగా కుమార్తె ప్రయాణ తేదీ మార్పు కోసం మరో రూ.45,000 చెల్లించారు. సుమారు 15 గంటల పాటు సాగిన ఈ ప్రయాణంలో వారికి దారుణమైన పరిస్థితులు ఎదురయ్యాయి. విమానంలో సీట్లు విరిగిపోయి ఉన్నాయని, బ్యాక్‌రెస్ట్ బటన్లు పనిచేయలేదని, కనీసం సహాయం కోసం ఫ్లైట్ అటెండెంట్‌ను పిలిచే బటన్ కూడా మొరాయించిందని వారు ఆరోపించారు.

అసహ్యకరమైన పరిస్థితులు

ప్రయాణికుల ఫిర్యాదు ప్రకారం.. విమానం లోపల భరించలేని దుర్వాసన వస్తోంది. 15 గంటల ప్రయాణంలో ఒక్కసారి కూడా ఎయిర్ ఫ్రెషనర్ వాడలేదని వారు వాపోయారు. ఇక వాష్‌రూమ్స్ పరిస్థితి అయితే పబ్లిక్ టాయిలెట్ల కంటే దారుణంగా ఉందని, అపరిశుభ్రత రాజ్యమేలుతోందని ఫోటోలతో సహా సాక్ష్యాలను కమిషన్ ముందు ఉంచారు. భోజనం నాణ్యత లేదని, టీ చల్లగా ఉందని, సిబ్బంది ప్రవర్తన కూడా చాలా అమర్యాదకరంగా ఉందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై ఎయిర్‌లైన్‌కు లీగల్ నోటీసు పంపినా స్పందన లేకపోవడంతో వారు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు.

ఎయిర్‌లైన్ వాదన ఏంటి?

అయితే ఈ ఆరోపణలను ఎయిర్‌లైన్ సంస్థ తోసిపుచ్చింది. తాము అన్ని నిబంధనల ప్రకారం విమానాన్ని తనిఖీ చేశామని, ఏ లోపాలు లేవని పేర్కొంది. సదరు ప్రయాణికులు తమ సీట్లను బిజినెస్ క్లాస్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ చేయమని అడిగారని, అది కుదరదని చెప్పినందుకే ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని వాదించింది. టీవీలు పనిచేయడం లేదని వారు అబద్ధం చెప్పారని, తమ సిబ్బంది దగ్గరుండి వాటిని ఎలా వాడాలో చూపించారని ఎయిర్‌లైన్ చెప్పుకొచ్చింది.

కోర్టు తీర్పు ఇదే

విచారణ చేపట్టిన కన్స్యూమర్ కమిషన్ ఎయిర్‌లైన్ వాదనలో పస లేదని తేల్చింది. ప్రయాణికులు సమర్పించిన ఫోటోలు, ఆధారాలను బట్టి సేవల్లో లోపం ఉందని స్పష్టం చేసింది. లక్షల రూపాయలు వసూలు చేసి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం నేరమని కమిషన్ పేర్కొంది. లీగల్ నోటీసు ఇచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఎయిర్‌లైన్‌ను ప్రశ్నించింది. ప్రయాణం పూర్తయినందున టికెట్ ధరను వాపస్ చేయలేమని చెబుతూనే.. వారికి కలిగిన మానసిక వేదనకు గానూ రూ.50,000, కోర్టు ఖర్చుల కోసం మరో రూ.50,000 ఇలా మొత్తం రూ.1.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.

Tags:    

Similar News