BHARAT TAXI: ఈ నెలలోనే"భారత్" ట్యాక్సీలు
ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీసులకు చెక్... 'భారత్' బ్రాండ్‌తో కొత్త టాక్సీ సేవలు
భారతదేశంలో రోజూ కోట్లాది మంది ప్రయాణ అవసరాలకు ట్యాక్సీ సేవలపై ఆధారపడుతున్నారు. ఆఫీస్‌కు వెళ్లాలన్నా, రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్ చేరాలన్నా, ఒక్క క్లిక్‌తో క్యాబ్ బుక్ చేసుకునే సౌకర్యం ప్రజల జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. అయితే ఈ సౌకర్యంతో పాటు, ఇటీవలి కాలంలో ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఒకటే — అధిక ఛార్జీలు. ప్రైవేట్ ట్యాక్సీ యాప్‌లైన ఉబర్ మరియు ఓలా వంటి సంస్థలు అందించే సేవలు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, పీక్ అవర్స్, సర్జ్ ప్రైసింగ్, అదనపు ఫీజులు వంటి కారణాలతో ప్రయాణికులు ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు నిజమైన ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో భారత్ ట్యాక్సీ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇందులో ఆటో, క్యాబ్, బైక్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ భారత్ ట్యాక్సీ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. యూజర్లు తమ మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇదివరకు ఉన్న క్యాబ్ ఛార్జీల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా.. ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే ఈ సేవలను పొందే అవకాశముంది. సుమారు 1.4 లక్షల మంది డ్రైవర్లు భారత్ ట్యాక్సీ యాప్‌లో రిజిస్ట్రర్ చేసుకున్నట్లు కేంద్రం ఇటీవలే తెలిపింది. ఈ సేవల్లో రైడ్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని (100%) డ్రైవర్లకే చెల్లిస్తారు. అతి తక్కువ నామినల్ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫాంలో పనిచేయవచ్చు. భారత్ టాక్సీ.. ఓలా, ఉబర్ కంటే భిన్నంగా పనిచేస్తుంది. భారత్ ట్యాక్సీ సేవలు సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉంటాయి. అదనపు ఛార్జీలు ఉండవు. సుదూర ప్రయాణాలకు కూడా ఓలా, ఉబర్ కంటే ఇది చాలా చౌక ధరకే అందుబాటులో ఉంటుంది. ఓలా, ఉబర్ సేవలు కేవలం నగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి.
సామాన్య ప్రజల ప్రయాణ ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా భారత్ ట్యాక్సీ అనే కొత్త ప్రభుత్వ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రైవేట్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వాటికంటే మెరుగైన, పారదర్శకమైన, తక్కువ ధరల సేవలను అందించడమే ఈ భారత్ ట్యాక్సీ ప్రధాన ఉద్దేశం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసిన తర్వాతే ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక ఛార్జీలు, డ్రైవర్ల కమిషన్ భారం, ప్రయాణికులు–డ్రైవర్ల మధ్య తలెత్తే వివాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించారు.
కమీషన్ లేదు
భారత్ ట్యాక్సీ ప్రత్యేకతలలో ఇది అత్యంత ముఖ్యమైన అంశం. ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ యాప్‌లలో డ్రైవర్లు ఆయా కంపెనీలకు భారీ కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ కమిషన్ 20–30 శాతం వరకు ఉంటుంది. ఈ భారాన్ని డ్రైవర్లు ప్రయాణికులపై అదనపు ఛార్జీల రూపంలో మోపుతున్నారు. కానీ భారత్ ట్యాక్సీలో ఈ సమస్యే లేదు.ఈ ప్రభుత్వ ట్యాక్సీ సేవల్లో డ్రైవర్లు ప్రభుత్వానికి ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులు చెల్లించిన మొత్తం డబ్బు నేరుగా డ్రైవర్లకే చేరుతుంది. దీని వల్ల డ్రైవర్లకు పూర్తి ఆదాయం లభిస్తుంది, ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం దక్కుతుంది.