LIC : భారతదేశంలో పెట్టుబడి అనగానే సామాన్యుడికి మొదట గుర్తొచ్చే పేరు ఎల్ఐసీ. మార్కెట్లో ఎన్ని రకాల ప్రైవేట్ కంపెనీలు ఉన్నా, ప్రభుత్వ గ్యారెంటీతో పాటు నమ్మకమైన రిటర్న్స్ ఇచ్చే ఎల్ఐసీపైనే కోట్లాది మందికి భరోసా ఉంది. మీరు కూడా మీ భవిష్యత్తు కోసం నెలకు కేవలం రూ.1400 ఆదా చేస్తూ, భారీ మొత్తంలో రూ.25 లక్షల నిధిని సమకూర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఎల్ఐసీ అందిస్తున్న జీవన్ ఆనంద్(Jeevan Anand - ప్లాన్ నంబర్ 915) పాలసీ మీకు సరైన ఎంపిక. ఇది కేవలం సేవింగ్స్ ప్లాన్ మాత్రమే కాదు, జీవితాంతం ఉచిత బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
ఈ పథకం అసలు లెక్కలు గమనిస్తే సామాన్యులకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు, 35 ఏళ్ల వయస్సున్న వ్యక్తి రూ.5 లక్షల బీమా మొత్తం కోసం 35 ఏళ్ల కాలపరిమితితో ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. అప్పుడు అతను ఏడాదికి సుమారు రూ.16,300 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనిని నెలవారీగా చూస్తే కేవలం రూ.1400 మాత్రమే. అంటే రోజుకు దాదాపు రూ.45-46 పొదుపు చేస్తే చాలు. ఈ 35 ఏళ్లలో అతను మొత్తం రూ.5.70 లక్షలు జమ చేస్తాడు. కానీ పాలసీ మెచ్యూరిటీ సమయానికి ప్రస్తుత బోనస్ రేట్ల ప్రకారం అతనికి ఏకంగా రూ.25 లక్షల భారీ మొత్తం అందుతుంది. ఇందులో బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలతో పాటు, రూ.8.60 లక్షల రివిజనరీ బోనస్, రూ.11.50 లక్షల అదనపు బోనస్ కలిసి ఉంటాయి.
జీవన్ ఆనంద్ పాలసీలోని అత్యంత అద్భుతమైన ఫీచర్ ఏమిటంటే.. పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత కూడా బీమా కొనసాగడం. సాధారణంగా ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ అయినా మెచ్యూరిటీ డబ్బులు రాగానే ముగిసిపోతుంది. కానీ ఇందులో మీరు రూ.25 లక్షలు తీసుకున్న తర్వాత కూడా, మీపై ఉన్న రూ.5 లక్షల రిస్క్ కవర్ జీవితాంతం కొనసాగుతుంది. అంటే పాలసీదారుడు ఎప్పుడు మరణించినా (అతని వయస్సు 100 ఏళ్లయినా సరే), అతని కుటుంబ సభ్యులకు లేదా నామినీకి అదనంగా మరో రూ.5 లక్షలు చెల్లిస్తారు. అందుకే దీనిని నాన్ ఎండ్ పాలసీ అని కూడా అంటారు.
ఈ ప్లాన్ ద్వారా కేవలం రిటర్న్స్ మాత్రమే కాదు, పన్ను ఆదా ప్రయోజనాలు కూడా మెండుగా ఉన్నాయి. మీరు చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే మెచ్యూరిటీ సమయంలో వచ్చే రూ.25 లక్షలు, డెత్ బెనిఫిట్ కూడా సెక్షన్ 10(10D) కింద పూర్తిగా పన్ను రహితం. అత్యవసరంగా డబ్బులు కావాలంటే పాలసీ ప్రారంభించిన రెండేళ్ల తర్వాత లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. ఒకవేళ ప్రీమియం చెల్లించడం ఆలస్యమైతే నెలవారీ చెల్లింపులకు 15 రోజులు, ఇతర మోడ్స్‌కు 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తారు.
18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. మీ అవసరానికి తగ్గట్టుగా 15 నుంచి 35 ఏళ్ల వరకు పాలసీ టర్మ్‌ను ఎంచుకోవచ్చు. దీనికి అదనంగా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ లేదా క్రిటికల్ ఇల్నెస్ వంటి రైడర్లను కూడా జోడించుకుని మీ భద్రతను మరింత పెంచుకోవచ్చు. తక్కువ పొదుపుతో కోటీశ్వరులు కావాలనుకునే వారికి, కుటుంబానికి నిరంతర భద్రత కల్పించాలనుకునే వారికి ఎల్ఐసీ జీవన్ ఆనంద్ ఒక బంగారు బాట లాంటిది.