transactions: నగదు లావాదేవీలపై కేంద్రం ఉక్కుపాదం
పెద్ద మొత్తాల నగదు బ్యాంకుల కంటిచూపులోకి.. రూ.10 లక్షలు దాటితే బ్యాంకు ఐటీకి రిపోర్ట్ తప్పనిసరి.. రూ.20 లక్షలు మించితే నగదు ఉపసంహరణపై టీడీఎస్
దేశ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా అమలు చేయనున్న కఠినమైన కొత్త నిబంధనలు వ్యక్తులు, వ్యాపార సంస్థల రోజువారీ నగదు ప్రవాహంపై పెను ప్రభావం చూపనున్నాయి. ఈ మార్పుల ద్వారా పన్ను ఎగవేతకు అవకాశాలు తగ్గించి, వ్యవస్థను పూర్తి బ్యాంకింగ్ ఛానళ్లలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, లెక్కలు చూపని నగదుపై పన్ను, జరిమానాలు, సర్ఛార్జీలు, సెస్సులు కలిసి మొత్తం 84% వరకు పన్ను భారం పడే అవకాశం ఉందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా వెల్లడించారు. ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా జప్తు సందర్భాల్లో లెక్కలు లేని నగదు దొరికినప్పుడు ఈ అధిక పన్ను రేటు వర్తిస్తుంది. పన్ను చట్టాల ప్రకారం, అటువంటి ఆదాయంపై సెక్షన్ 115BBE కింద ఇప్పటికే 60% పన్ను, 25% సర్ఛార్జ్, 4% సెస్ విధిస్తున్నారు. దీనికి అదనంగా, దొరికిన నగదుకు ఆధారం చూపకుంటే జరిమానాలు కూడా విధిస్తారు. ఈ కఠిన చర్యల నేపథ్యంలో నగదు వినియోగంలో పౌరులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త నియమాల ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలను నిశితంగా పర్యవేక్షించనున్నాయి. ముఖ్యంగా ఈ కింది అంశాలపై బ్యాంకుల నిఘా ఉంటుంది.
రూ. 10 లక్షలకు పైగా నగదు ఉపసంహరణ: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా నగదు ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ కు తప్పనిసరిగా నివేదిస్తాయి. రూ. 20 లక్షలకు పైగా ఉపసంహరణ – టీడీఎస్ (TDS): ఏదైనా ఖాతా నుండి రూ. 20 లక్షలకు మించి నగదు ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు తక్షణమే మూలం వద్ద పన్ను కోత (TDS) విధిస్తాయి. ఇది పన్ను ఎగవేతను నివారించేందుకు ఒక కీలక చర్యగా చెప్పవచ్చు.
సోదాలు, జప్తు చర్యలు: తరచుగా పెద్ద మొత్తాల నగదు ఉపసంహరణలు జరిగితే, వాటి మూలం అనుమానాస్పదంగా కనిపిస్తే, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా జప్తు చర్యలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ లావాదేవీలకు 100% జరిమానా
నగదు వాడకాన్ని నిరుత్సాహపరచడానికి కొన్ని ప్రత్యేక లావాదేవీలపై ఇకపై 100 శాతం జరిమానా విధించనున్నారు. స్థిరాస్తి విక్రయం సమయంలో రూ. 20,000 కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తే, స్వీకరించిన మొత్తంపై 100% జరిమానా పడుతుంది. ఒక కస్టమర్ నుండి ఒకే రోజులో రూ. 2 లక్షలకు పైగా నగదు అందుకుంటే, ఆ మొత్తంపైనే జరిమానా విధిస్తారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నగదు నియంత్రణ వ్యవస్థ నేపథ్యంలో, వ్యక్తులు, వ్యాపార సంస్థలు తప్పకుండా తమ పెద్ద మొత్తాల లావాదేవీలను బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారానే జరపాలని, ప్రతి లావాదేవీకి స్పష్టమైన రికార్డులు, ఆధారాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.