Car Loan : కారు లోన్ కావాలా? బ్యాంకులు లోన్ రిజెక్ట్ చేయకుండా ఉండాలంటే ఇవి పాటించండి.
Car Loan : ఈ రోజుల్లో కారు అనేది కేవలం హోదా మాత్రమే కాదు, చాలా కుటుంబాలకు ఒక అవసరం కూడా. అయితే, చేతిలో పెద్ద మొత్తం లేకపోయినా మనకు నచ్చిన కారును ఇంటికి తెచ్చుకోవడానికి కారు లోన్ ఒక అద్భుతమైన మార్గం. కానీ, సరిగ్గా అవగాహన లేకపోతే బ్యాంకులు లోన్ ఇవ్వడానికి నిరాకరించవచ్చు. అందుకే లోన్ అప్లై చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
1. సిబిల్ స్కోర్
బ్యాంకు మీరు లోన్ అడిగినప్పుడు ముందుగా చూసేది మీ సిబిల్ స్కోర్. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే లోన్ సులభంగా మంజూరవుతుంది. స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు లోన్ రిజెక్ట్ చేయడమే కాకుండా, ఒకవేళ ఇచ్చినా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. కాబట్టి లోన్ అప్లై చేయడానికి కొన్ని నెలల ముందే మీ స్కోర్ చెక్ చేసుకోండి.
2. ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం
లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు ఉందో లేదో బ్యాంకులు పరీక్షిస్తాయి. జీతం పొందే వారైతే కనీసం ఏడాది పాటు ఒకే చోట పని చేస్తున్నారా? నెలకు కనీసం రూ.25,000 ఆదాయం ఉందా? అని చూస్తారు. ఇక వ్యాపారస్తులైతే గత 2-3 ఏళ్ల ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
3. వడ్డీ రేట్ల మాయాజాలం
కారు లోన్‌లలో రెండు రకాల వడ్డీలు ఉంటాయి. ఫిక్స్‌డ్ అంటే లోన్ పూర్తయ్యే వరకు వడ్డీ రేటు మారదు. ఫ్లోటింగ్ అంటే మార్కెట్ హెచ్చుతగ్గుల బట్టి మారుతుంటుంది. 2026 నాటి లెక్కల ప్రకారం చాలా బ్యాంకులు 8.5% నుంచి 9.5% మధ్య వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. మీ అవసరానికి ఏది సరిపోతుందో బేరీజు వేసుకోండి.
4. ఆదాయం - ఈఎంఐ మధ్య బ్యాలెన్స్
మీరు నెలకు సంపాదించే మొత్తంలో 50% కంటే ఎక్కువ ఇతర అప్పుల కింద లేదా ఈఎంఐల కింద వెళ్లకూడదు. ఒకవేళ మీకు ఇప్పటికే పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్ ఉంటే, కారు లోన్ రావడం కొంచెం కష్టం కావచ్చు. అలాంటి సమయంలో పాత అప్పులను క్లియర్ చేయడం మంచిది.
5. డౌన్ పేమెంట్ చేసే అలవాటు చేసుకోండి
కొన్ని బ్యాంకులు 100% ఆన్-రోడ్ ప్రైస్ లోన్ ఇస్తామని చెబుతాయి. కానీ, మీ దగ్గర ఉన్న డబ్బుతో కనీసం 15-20% డౌన్ పేమెంట్ చేయడం వల్ల మీకు వడ్డీ భారం తగ్గుతుంది. అంతేకాకుండా బ్యాంకుకు మీపై నమ్మకం పెరిగి లోన్ త్వరగా అప్రూవ్ అవుతుంది.
6. ఇతర చార్జీలపై కన్నేయండి
కేవలం వడ్డీ రేటు మాత్రమే కాదు.. లోన్ ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ వంటివి కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఫెస్టివల్ ఆఫర్లలో బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తాయి. అప్లై చేసే ముందు ఈ అదనపు ఖర్చుల గురించి తప్పకుండా ఆరా తీయండి.
7. గడువు ముందే లోన్ కట్టేస్తే ఫీజులు
మీ దగ్గర డబ్బులు వచ్చినప్పుడు లోన్‌ను ముందే క్లోజ్ చేయాలనుకుంటే, బ్యాంకులు 3% నుంచి 6% వరకు పెనాల్టీ విధిస్తాయి. లోన్ తీసుకునే ముందే ఈ ప్రీ-పేమెంట్, ఫోర్ క్లోజర్ నిబంధనల గురించి బ్యాంకు అధికారులను అడగండి.