New EV SUVs : బడ్జెట్ రెడీ చేస్కోండి..మార్కెట్లోకి 3 సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు.
New EV SUVs : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా మొదలైంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవడమే కాకుండా, పర్యావరణ హితంగా ఉండటంతో జనం ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ దిగ్గజ సంస్థలు మారుతి సుజుకి, టాటా మోటార్స్ మరియు టొయోటా తమ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను రంగంలోకి దించుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచే వీటి సందడి షురూ కానుంది.
భారతీయ రోడ్లపై ఎలక్ట్రిక్ కార్ల సందడి పెరగబోతోంది. ముఖ్యంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి, టాటా, టయోటా సంస్థలు మూడు అద్భుతమైన కార్లను సిద్ధం చేశాయి. ఇవి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా ఈవీ (ధర రూ.18.02 లక్షల నుంచి రూ.24.70 లక్షలు)కి గట్టి పోటీనివ్వనున్నాయి.
1. టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ : టయోటా నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇది. దీని ధరను జనవరి 19న అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కారు మారుతి ఇ-విటారా ప్లాట్‌ఫారమ్‌పైనే ఆధారపడి నిర్మించబడింది. ఇందులో 49kWh, 61kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది ఏకంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని అంచనా. టయోటా సిగ్నేచర్ స్టైల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు మరియు ప్రీమియం ఇంటీరియర్స్ దీని ప్రత్యేకత.
2. మారుతి ఇ-విటారా : మారుతి సుజుకి నుంచి వస్తున్న తొలి ప్యూర్ ఎలక్ట్రిక్ కారు ఇది. జనవరి నెలాఖరులో ఇది లాంచ్ కానుంది. ఇది మూడు వేరియంట్లలో (49kWh 2WD, 61kWh 2WD, 61kWh AWD) లభించనుంది. దీని రేంజ్ సుమారు 344 కి.మీ నుండి 428 కి.మీ మధ్యలో ఉంటుంది. సేఫ్టీ కోసం ఇందులో లెవల్-2 అడాస్ (ADAS), 7 ఎయిర్‌బ్యాగ్స్, వెంటిలేటెడ్ సీట్లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. మారుతి నమ్మకం, తక్కువ మెయింటెనెన్స్ ఈ కారుకు ప్లస్ పాయింట్ కానుంది.
3. టాటా సియెర్రా ఈవీ : టాటా మోటార్స్ తన ఐకానిక్ సియెర్రా బ్రాండ్‌ను ఎలక్ట్రిక్ రూపంలో మళ్ళీ తెస్తోంది. ఇది రాబోయే కొద్ది నెలల్లో మార్కెట్లోకి వస్తుంది. ఇందులో 65kWh లేదా 75kWh వంటి పెద్ద బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించనున్నారు. దీని రేంజ్ కూడా 500 కి.మీ కంటే ఎక్కువే ఉండొచ్చు. ఈ కారులో వెహికల్-టు-లోడ్ (V2L), వెహికల్-టు-వెహికల్ (V2V) ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది. అంటే మీ కారుతోనే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లేదా మరో ఎలక్ట్రిక్ కారును ఛార్జ్ చేయవచ్చు. దీనికి తోడు 5G కనెక్టివిటీ కూడా ఉండబోతోంది.