GOLD: భారీగా పెరుగుతున్న పసిడి దిగుమతులు
విపరీతంగా పెరుగుతున్న ధరలు.... మార్చిలో 192.13 శాతం పెరిగిన బంగారం దిగుమతి వృద్ధి;
బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులు పసిడి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంటున్నాయి. అమెరికా విధిస్తున్న సుంకాల ఆందోళనల మధ్య బంగారం పెరుగుతోంది. మరోవైపు భారత్‌లో బంగారం దిగుమతులు భారీగానే పెరుగుతున్నాయి. మార్చిలో బంగారం దిగుమతుల్లో భారీగా వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మార్చిలో 192.13 శాతం పెరిగి 4.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.38వేల కోట్లకు చేరాయి. బంగారం దిగుమతులు ఫిబ్రవరి 2025లో దాదాపు 62 శాతం తగ్గాయి. జనవరిలో 40.8 శాతం, డిసెంబర్ 2024లో 55.39 శాతం పెరిగాయి. అయితే, వెండి దిగుమతులు మార్చిలో 85.4 శాతం తగ్గి 119.3 మిలియన్ డాలర్లకు చేరాయి.
58 బిలియన్లకు చేరిన బంగారం దిగుమతులు
వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతులు 27.27 శాతం పెరిగి 58 బిలియన్లకు చేరాయి. ఇది 2023-24లో 45.54 బిలియన్లుగా ఉంది. దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 8 శాతం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 11.24 శాతం తగ్గి 4.82 బిలియన్లకు చేరాయి. ధరలు నిరంతరం పెరుగుతున్నప్పటికీ పసిడి దిగుమతులు పెరగడం, బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ప్రపంచ మార్కెట్‌లో అనిశ్చిత, దేశాల మధ్య ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల నుంచి డిమాండ్, ధరల పెరుగుదల సైతం దిగుమతులు పెరిగేందుకు కారణం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
రికార్డు స్థాయిలో ధరలు
భారత్ బంగారం దాదాపు 40శాతం స్విట్జర్లాండ్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఆ తర్వాత 16 శాతంతో దుబాయి రెండో స్థానంలో నిలిచింది. 10 శాతంతో దక్షిణాఫ్రికా మూడోస్థానంలో ఉంది. ఈ ఏడాది జనవరి ఒకటిన 10 గ్రాముల పసిడి రూ.79,390 వద్ద ఉండగా.. ఈనెల 19 నాటికి రికార్డు స్థాయిలో రూ.98,170కి చేరింది. బంగారం దిగుమతులు పెరగడం వల్ల మార్చిలో దేశ వాణిజ్య లోటు 21.54 బిలియన్లకు పెరిగింది. స్వల్పకాలంలో బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలపై HDFC సెక్యూరిటీస్‌లోని కమోడిటీ & కరెన్సీ హెడ్ అనుజ్ గుప్తా మాట్లాడుతూ, "ట్రేడ్ వార్ తీవ్రతరం కావడం, ట్రంప్ సుంకాల వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. యూఎస్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్‌తో సహా చాలా మంది ఆర్థికవేత్తలు చెప్పినట్లుగా, ఒక శాతం సుంకాల పెరుగుదల US ఆర్థిక వృద్ధిని దాదాపు 0.10 శాతం తగ్గిస్తుంది; US మాంద్యం వస్తుందని మార్కెట్ భయపడుతోంది.