Hyundai Venue vs Tata Nexon Diesel : హ్యుందాయ్ వెన్యూ vs టాటా నెక్సాన్.. డీజిల్ ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?

Update: 2025-11-18 08:15 GMT

Hyundai Venue vs Tata Nexon Diesel :మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి డీజిల్ ఎస్‌యూవీ కొనాలని చూస్తున్నారా? అయితే మార్కెట్‌లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ డీజిల్ మోడల్స్ మధ్య గట్టి పోటీ ఉంది. ధరల పరంగా చూస్తే నెక్సాన్ కాస్త చౌకగా ఉన్నా, ఫీచర్లు, టెక్నాలజీ విషయంలో వెన్యూ మెరుగ్గా ఉంటుంది. ఈ రెండు కార్లలో ఏది ఎక్కువ పవర్‌ఫుల్, మీ అవసరాలకు ఏది బాగా సరిపోతుందో కొనే ముందు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ధర, పవర్, మైలేజ్, ఫీచర్ల పరంగా ఈ రెండింటి మధ్య తేడాలను వివరంగా చూద్దాం.

ధర, బడ్జెట్

బడ్జెట్ కొంచెం తక్కువగా ఉన్నవారికి టాటా నెక్సాన్ డీజిల్ మంచి ఎంపిక. నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.9.01 లక్షల నుంచి మొదలై, టాప్ వేరియంట్ రూ.13.42 లక్షల వరకు ఉంటుంది. దీనితో పోలిస్తే హ్యుందాయ్ వెన్యూ డీజిల్ ధర రూ.9.70 లక్షల నుంచి మొదలై, టాప్ వేరియంట్ రూ.15.69 లక్షల వరకు చేరుతుంది. అందుకే బడ్జెట్ కొంచెం టైట్‌గా ఉంటే నెక్సాన్ డబ్బు ఆదా చేస్తుంది. అయితే ప్రీమియం ఫీల్, మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కావాలనుకుంటే వెన్యూ వైపు మొగ్గు చూపవచ్చు.

ఇంజిన్, పర్ఫామెన్స్

ఈ రెండు ఎస్‌యూవీలు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తున్నప్పటికీ, వాటి డ్రైవింగ్ అనుభవం వేరుగా ఉంటుంది. టాటా నెక్సాన్ 260 Nm టార్క్ కలిగి ఉంది. ఈ ఎక్కువ టార్క్ కారణంగా హైవేలపై కారుకు ఎక్కువ పుల్లింగ్ పవర్ లభిస్తుంది.. ఓవర్‌టేకింగ్ సులభం అవుతుంది. అంటే, ఎక్కువ దూరం హైవేలపై ప్రయాణించేవారికి నెక్సాన్ మెరుగ్గా ఉంటుంది. దీనికి భిన్నంగా హ్యుందాయ్ వెన్యూ 116 PS పవర్ ఇస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌లో స్మూత్‌గా, త్వరగా స్పందించే ఫీలింగ్‌ను ఇస్తుంది. రోజువారీ సిటీ వినియోగానికి వెన్యూ అనుకూలంగా ఉంటుంది.

మైలేజ్ పోలిక

డీజిల్ కారు కొనేటప్పుడు మైలేజ్ అనేది అతిపెద్ద అంశం. మైలేజ్ విషయంలో టాటా నెక్సాన్ స్పష్టంగా ముందుంది. నెక్సాన్ డీజిల్ (AMT) లీటరుకు 24.08కిమీ, (MT) 23.23కిమీ మైలేజ్ ఇస్తుంది. ఇది సెగ్మెంట్‌లోనే బెస్ట్ మైలేజ్‌గా చెప్పొచ్చు. దీనితో పోలిస్తే హ్యుందాయ్ వెన్యూ డీజిల్ (MT) దాదాపు లీటరుకు 20.99కిమీ, (AT) 17.9 kmpl మైలేజ్ ఇస్తుంది. ఈ పోలికలో నెక్సాన్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.

ఫీచర్లు, టెక్నాలజీ

టెక్నాలజీ, ఫీచర్ల విషయంలో రెండు కార్లు ఆధునికంగా ఉన్నాయి. టాటా నెక్సాన్ లో కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, JBL సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అయితే హ్యుందాయ్ వెన్యూ టెక్నాలజీ పరంగా ఒక అడుగు ముందుకేసి, డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్‌లు, లెవెల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా, స్మూత్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అదనంగా నెక్సాన్ 208 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్-రోడింగ్‌కు బాగా ఉపయోగపడుతుంది, కానీ వెన్యూ 399L బూట్ స్పేస్ మరింత విశాలంగా ఉంటుంది.

ఏది బెస్ట్ ?

సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్ బలమైన పోటీదారు. దీనికి 5-స్టార్ రేటింగ్ ఉంది. ఇందులో ADAS, ESC, 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ వెన్యూలో కూడా మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్నప్పటికీ, క్రాష్ టెస్ట్ రేటింగ్, బిల్డ్ క్వాలిటీ విషయంలో నెక్సాన్ కొంచెం మెరుగ్గా ఉందని చెప్పొచ్చు.

Tags:    

Similar News