MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీలో ఏ వేరియంట్ బెస్ట్? ఎసెన్స్ vs ఎక్స్‌క్లూజివ్ ప్రో మధ్య అసలైన తేడాలివే.

Update: 2026-02-28 13:15 GMT

MG Windsor EV : ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఇప్పుడు ఎంజీ విండ్సర్ ఈవీ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి, విశాలమైన కేబిన్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే ఈ కారులో ఉన్న రకరకాల వేరియంట్లు, రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లు కొనుగోలుదారులను కాస్త కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నాయి. ప్రధానంగా విండ్సర్ ఎసెన్స్, ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్ల మధ్య ఏది తీసుకోవాలి? అనే సందేహం చాలామందిలో ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను, ఫీచర్లను బేరీజు వేస్తే మీ నిర్ణయం ఈజీ అవుతుంది.

విండ్సర్ ఎసెన్స్.. ఎక్స్‌క్లూజివ్ ప్రో మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం వాటి బ్యాటరీ సామర్థ్యం. విండ్సర్ ఎసెన్స్ అనేది హై-ఎండ్ ఫీచర్లు ఉన్న వేరియంట్ అయినప్పటికీ, ఇందులో 38 kWh చిన్న బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మరోవైపు, ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్ ధరలో ఎసెన్స్ కంటే కొంచెం ఎక్కువైనా, ఇందులో 52.9 kWh పెద్ద బ్యాటరీ లభిస్తుంది. దీనివల్ల రేంజ్ ఏకంగా 449 కిలోమీటర్లకు పెరుగుతుంది. అంటే, మీరు సిటీలో తిరగడానికి కారు కావాలనుకుంటే ఎసెన్స్ సరిపోతుంది, కానీ లాంగ్ ట్రిప్పులు వేయాలనుకుంటే మాత్రం ఎక్స్‌క్లూజివ్ ప్రో వైపు మొగ్గు చూపడం మంచిది.

డిజైన్ విషయానికి వస్తే.. రెండింటి మధ్య కొన్ని స్పష్టమైన మార్పులు ఉన్నాయి. విండ్సర్ ఎసెన్స్‌లో 18 ఇంచుల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వస్తాయి. అదే ఎక్స్‌క్లూజివ్ ప్రోలో డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఇస్తున్నారు. కారు లోపల కూడా మార్పులు ఉన్నాయి. ఎసెన్స్ వేరియంట్ నైట్ బ్లాక్ ఇంటీరియర్‌తో వస్తుండగా, ప్రో వేరియంట్ కొత్త డ్యూయల్-టోన్ ఐవరీ వైట్ ఇంటీరియర్‌తో లగ్జరీ లుక్ ఇస్తుంది. అయితే, ఎసెన్స్ వేరియంట్‌లో ఉన్న PM2.5 ఎయిర్ ఫిల్టర్ సదుపాయం ఎక్స్‌క్లూజివ్ ప్రోలో ఉండదు. ఎయిర్ క్వాలిటీ ముఖ్యం అనుకునే వారికి ఇది గమనించాల్సిన విషయం.

ఫీచర్ల పరంగా ఎసెన్స్ వేరియంట్ మరిన్ని హంగులను జోడిస్తుంది. ఇందులో అద్భుతమైన ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్, మూడ్ సెట్ చేసే యాంబియంట్ లైటింగ్ ఉంటాయి. కానీ, మీరు ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్ ఎంచుకుంటే ఈ గ్లాస్ రూఫ్, లైటింగ్ ఫీచర్లను వదులుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ కంపెనీ ఫీచర్లు కావాలా? లేక రేంజ్ కావాలా? అనే ఆప్షన్‌ను కస్టమర్లకే వదిలేసింది. మీకు రేంజ్ కంటే కారులో ఉండే విలాసవంతమైన ఫీచర్లే ప్రాధాన్యత అయితే ఎసెన్స్ బెస్ట్ ఛాయిస్.

ధరల విషయానికి వస్తే విండ్సర్ ఎసెన్స్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.16.52 లక్షలు. ఎక్స్‌క్లూజివ్ ప్రో ధర రూ.17.37 లక్షలు. అంటే మరో రూ.85,000 అదనంగా ఖర్చు చేస్తే మీకు పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్ లభిస్తాయి. కానీ గ్లాస్ రూఫ్ వంటి ఫ్యాన్సీ ఫీచర్లు ఉండవు. ఒకవేళ ఇది మీ ఇంట్లో రెండో కారు అయితే, ఎక్కువగా సిటీలోనే వాడతారంటే ఎసెన్స్ వేరియంట్ అన్ని విధాలా సరిపోతుంది. కానీ ఇదే మీ మెయిన్ కారు అయితే మాత్రం రేంజ్ టెన్షన్ లేకుండా ఉండటానికి ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్ తీసుకోవడం తెలివైన పని.

Tags:    

Similar News