MUSK: ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్?
కుబేరుడు ఎలాన్ మస్క్ మరో ఘనత..?
రానున్న కొన్నేళ్లలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో ఘనత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా విస్తరణ లక్ష్యాలు చేరుకుంటే.. ప్రతిపాదిత ప్రోత్సాహక ప్యాకేజీ కింద సంస్థ సీఈవోగా ఆయనకు భారీ మొత్తం సమకూరనుంది. దీంతో ఆయన సంపద అమాంతం పెరిగి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్ ఇప్పటికే తొలి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ సుమారు 400 బిలియన్ డాలర్లు. అయితే, రానున్న రోజుల్లో మార్కెట్ విలువను భారీగా పెంచేందుకు టెస్లా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువను రానున్న పదేళ్లలో భారీగా పెంచాలని ప్రతిపాదించింది.
ఇందుకోసం రోబోట్యాక్సీ, ఏఐ మార్కెట్ విస్తరణ వంటి లక్ష్యాలను పెట్టింది. ఈ పనితీరు లక్ష్యాలను ఎలాన్ మస్క్ సాధిస్తే ప్రతిపాదిత ప్రోత్సాహక ప్యాకేజీ కింద ఆయనకు భారీగా షేర్లు సమకూరుతుంది. దాదాపు 900 బిలియన్ డాలర్లు సమకూరనున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మస్క్ సంపద విలువ ట్రిలియన్ డాలర్లు దాటిపోతుంది. మరోవైపు కార్పొరేట్ చరిత్రలోనే ఇది భారీ ప్రోత్సాహకంగా మిగలనుంది. అమెరికా అధ్యక్షుడితో ఎలాన్ మస్క్ విభేదాల తర్వాత టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో పాటు చైనాలోని బీవైడీ తదితర కంపెనీల నుంచి పోటీ కూడా పెరిగింది. జర్మనీలో కూడా అమ్మకాలు పడిపోయాయి. టెస్లా భారీ విస్తరణ అంచనాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.88 లక్షల కోట్ల) వేతన ప్యాకేజీని అందుకునే అవకాశం ఉంది. టెస్లా అనుకున్న లక్ష్యాలను చేరితే ఇది సాధ్యమని కంపెనీ విడుదల చేసిన పత్రాలను బట్టి తెలుస్తోంది. కార్ల ఉత్పత్తి నుంచి కంపెనీ మొత్తం విలువ వరకు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరితే కనుక మస్క్ ఈ భారీ ప్యాకేజీని (షేర్ల బదిలీ ద్వారా) అందుకోగలరని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో టెస్లా పేర్కొంది. వచ్చే పదేళ్లలో కంపెనీ విలువను ప్రస్తుత లక్ష కోట్ల డాలర్ల నుంచి 8 లక్షల కోట్ల డాలర్లకు పెంచాలి. అపుడే 12శాతం షేర్లు మస్క్‌కు బదిలీ అవుతాయి.