NEW CARS: మార్చిలో నయా కార్ల జోష్...!
కొత్త కార్ల సందడి... రెనో డస్టర్ రీఎంట్రీ... బెంజ్ వీ-క్లాస్ విడుదల... ఆటమొబైల్ మార్కెట్ జోష్
దేశీయ రోడ్లపైకి మరికొన్ని సరికొత్త కార్లు దూసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వివిధ మోడళ్లతో వాహనదారులను ఆకట్టుకుంటున్న ఆటోమొబైల్ దిగ్గజాలు, వచ్చే మార్చి నెలలో మరిన్ని విభిన్న రకాల వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి. లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్‌తో పాటు రెనో, ఆడీ, స్కోడా, టయోటా వంటి అంతర్జాతీయ సంస్థలు తమ సరికొత్త మోడళ్లను సిద్ధం చేశాయి. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ఎస్‌యూవీల నుండి అత్యంత ఖరీదైన ప్రీమియం లగ్జరీ కార్ల వరకు ఈ జాబితాలో ఉండటం విశేషం.
ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ రెనో తన ఐకానిక్ మోడల్ 'డస్టర్'ను సరికొత్త హంగులతో మళ్లీ భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతోంది. మార్చి 17న ఈ కారును విడుదల చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2022లో ఈ మోడల్‌ను ఉపసంహరించుకున్న సంస్థ, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దీనిని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇది 1.0 లీటర్, 1.3 లీటర్ సామర్థ్యం గల రెండు టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో రానుంది. ఆరు మాన్యువల్ గేర్లు, అధునాతన సాంకేతిక ఫీచర్లతో రూపొందిన ఈ కారుతో పాటు, వచ్చే దీపావళి నాటికి 1.8 లీటర్ల ఇంజిన్ కలిగిన మరో మోడల్‌ను కూడా తీసుకురావాలని రెనో ప్లాన్ చేస్తోంది. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెజ్-బెంజ్ కూడా తన వీ-క్లాస్ మోడల్‌ను మరోసారి భారత మార్కెట్‌కు పరిచయం చేయనుంది. వచ్చే వారంలో మార్చి 2వ తేదీన విడుదల కానున్న ఈ కారును గతంలో నిలిపివేసినప్పటికీ, పెరిగిన డిమాండ్ దృష్ట్యా మళ్లీ విక్రయానికి సిద్ధం చేసింది.
ఆరుగురు లేదా ఎనిమిది మంది ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేసిన ఈ లగ్జరీ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభించనుంది. లెక్సస్ ఎల్ఎం, ఎంజీ ఎం9, టయోటా వెల్ఫైర్ వంటి ప్రీమియం వాహనాలకు గట్టి పోటీనిచ్చేలా బెంజ్ ఈ వీ-క్లాస్‌ను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దింది. వీటితో పాటు మార్చి నెలలో ఆడీ తన పవర్ఫుల్ ఎస్యూవీ 'SQ8'ని విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. 4.0 లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు స్పోర్టీ డిజైన్, అత్యుత్తమ వేగంతో లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకోనుంది. మరోవైపు స్కోడా సంస్థ తన పాపులర్ మోడల్ 'కుషాక్' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా ఈ నెలలోనే మార్కెట్లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. అప్డేటెడ్ ఇంటీరియర్స్, కొత్త ఎక్స్టీరియర్ ఫీచర్లతో రానున్న ఈ కారు మిడ్-సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో మళ్ళీ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని ఆశిస్తోంది.
మార్చి నెలలో వస్తున్న ఈ కార్ల సందడి కేవలం పెట్రోల్, డీజిల్ వాహనాలకే పరిమితం కాకుండా ఎలక్ట్రిక్ విభాగంలో కూడా కొనసాగనుంది. టయోటా సంస్థ తన 'అర్బన్ క్రూజర్ ఎబెల్లా' ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధరను మార్చి 15న ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే బీవైడీ, ఎంజీ వంటి సంస్థలు కూడా తమ ఎలక్ట్రిక్ మోడళ్లను సిద్ధం చేస్తున్నాయి. మొత్తానికి సమ్మర్ సీజన్ ప్రారంభానికి ముందే దేశీయ ఆటోమొబైల్ రంగం కొత్త మోడళ్లతో కళకళలాడనుంది, ఇది వాహన కొనుగోలుదారులకు ఒక గొప్ప అవకాశంగా మారనుందని నిపుణులు పేర్కొన్నారు.