No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ.. లాభమా? భారమా..?
నో కాస్ట్ ఈఎంఐ వెనుక ఉన్న వ్యాపార లెక్కలు వేరు;
‘వడ్డీ లేని ఈఎంఐ, నెలవారీగా చెల్లింపులు, క్రెడిట్ స్కోర్ మెరుగుదల..’ ఇవన్నీ వినిపించటానికి ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తున్నా, వాస్తవికంగా నో కాస్ట్ ఈఎంఐ వెనుక ఉన్న వ్యాపార లెక్కలు వేరు. తాజాగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్టాప్‌లు, టీవీలు, ఫ్రిడ్జిలు మొదలైన పరికరాలను కొనుగోలు చేసే కస్టమర్లలో ఈ స్కీమ్ విస్తృతంగా వాడుకలో ఉంది.
నష్టాలే చేయని వ్యాపారం!
ఏ వ్యాపారవేత్త అయినా లాభం కోసమే వ్యాపారం చేస్తాడు. వడ్డీ లేకుండా ఈఎంఐలు ఇవ్వడమంటే, వడ్డీ మొత్తాన్ని ఎవరో భరిస్తున్నారు. ఈ పథకం కింద బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు వడ్డీ తీసుకోవడం ఆపవు. వాస్తవంగా, అదే వడ్డీని సబ్సిడీ రూపంలో విక్రేతలు లేదా ఉత్పత్తిదారులు భరిస్తారు. లేదా అదే మొత్తాన్ని ఉత్పత్తి ధరలోనే చేర్చేస్తారు. ఉదాహరణకు, రూ. 30,000 విలువైన ఫోన్‌ను నో కాస్ట్ ఈఎంఐపై తీసుకుంటే, దాని అసలు మార్కెట్ ధర రూ. 28,000 మాత్రమే అయి ఉండొచ్చు. మిగతా రూ. 2,000 వడ్డీని ముందుగానే ఉత్పత్తి ధరలో కలిపి అమ్ముతున్నారు.
నిజంగా లాభం ఉంటుందా?
వినియోగదారుడి కోణంలో చూస్తే, పెద్ద మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండా కొంత డౌన్‌పేమెంట్ ఇవ్వడం, నెలవారీగా చెల్లించటం అనేది సౌలభ్యం. ముఖ్యంగా జీతాలపై ఆధారపడే మధ్య తరగతి కుటుంబాలకు ఇది మంచి ఎంపిక. అలాగే, ఈ చెల్లింపుల వివరాలు క్రెడిట్ బ్యూరోలకు చేరతాయి. సమయానికి ఈఎంఐ చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. దీంతో భవిష్యత్తులో లోన్ తీసుకోవడంలో సులభత ఉంటుంది.
మిస్ అయినా… పెద్ద నష్టమే!
అయితే ఈ ఈఎంఐ పథకాల్లో ఒక నెల ఎడతెరపైనే సిబిల్ స్కోరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆలస్యంగా చెల్లిస్తే లేదా డీఫాల్ట్ చేస్తే, పెనాల్టీలు పడే అవకాశముంది. కొన్ని సంస్థలు ఆలస్యం పై అదనపు వడ్డీ వసూలు చేస్తాయి. ఇంకా ఓ ముఖ్యమైన అంశం — మల్టిపుల్ ఓపెన్ లోన్స్. మీరు తరచూ నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్‌లను ఉపయోగిస్తే, మీ క్రెడిట్ రిపోర్టులో అనేక చిన్న చిన్న లోన్ ఖాతాలు ఓపెన్‌గా కనిపిస్తాయి. ఇది మల్టిపుల్ లెండింగ్ రిస్క్‌గా పరిగణించబడుతుంది. ఇది మీ రుణ నాణ్యతపై అనుమానాలు కలిగించి, భవిష్యత్తులో పెద్ద లోన్లను పొందడంలో ఆటంకం కలిగించవచ్చు.
నో కాస్ట్ ఈఎంఐలు ప్రత్యేకించి రెగ్యులర్ ఆదాయ వనరులు ఉన్నవారికి అనుకూలం. సమయానికి చెల్లించగలవారైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. కానీ ఆదాయం నిలకడగా లేకపోతే లేదా డబ్బు మేనేజ్‌మెంట్‌పై పూర్తి కంట్రోల్ లేకపోతే, దీన్ని ఆలోచించకుండా ఎంచుకోవడం మంచిది కాదు.