GST: జీఎస్టీ తగ్గింపు.. వ్యాపారాలకు పండగే
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలపై హర్షం
వస్తు, సేవల పన్ను శ్లాబులో కేంద్రం భారీ సంస్కరణలు చేసింది. ప్రస్తుతం ఉన్న 5%, 12%, 18%, 28% నాలుగు శ్లాబులను తొలగించి, వాటి స్థానంలో (5%, 18%) కేవలం రెండు శ్లాబులు మాత్రమే అందుబాటులో తీసుకురానుంది. ఈ సంస్కరణలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో దీపావళి పండగ వేళ సామాన్యలుకు డబుల్ ధమాకా ఆఫర్‌గా ఎన్డీయే వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, జీఎస్టీ తగ్గింపు ప్రజల కంటే.. వ్యాపారాలకు ఊపునివ్వడం ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే.. పండగల సమయంలో సాధారణంగా ప్రజలు ఎక్కువగా వస్తువులు కొనుగోళ్లు చేస్తారు. జీఎస్టీ తగ్గిస్తే.. వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. ఫలితంగా డిమాండ్ పెరుగుతుంది. ఒక వస్తువు కొనాల్సిన వినియోగదారులు... రెండు మూడు వస్తువులు అదనంగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.
ఉపాంత ప్రయోజనం పక్కన పెడితే.. నిత్యావసర వస్తువులకు ధరలు తగ్గితే.. డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే సామాన్యుల విషయంలో గిఫెన్ వైపరీత్యానికి పూర్తిగా విరుద్ధం. జీఎస్టీ తగ్గింపు ఫలితంగా వాస్తవ వేతనాలు పెరగకుండానే.. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీంతో నిత్యావసర వస్తులు, ఉత్పత్తుల తయారీ, విక్రయ మార్కెట్ జోరు అందుకుంటుంది. దేశంలోని చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు, ఎంఎస్‌ఎంఈలకు, స్టార్టప్‌లకు ప్రోత్సాహకర వాతావరణం కలిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తద్వారా ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం పెరిగి.. వర్కింగ్ క్యాపిటల్ లభ్యత పెరుగుతుంది. గత దీపావళిని ఉదాహరణగా తీసుకుంటే.. Confederation of All India Traders ప్రకారం.. 2024 దీపావళి సీజన్‌లో దేశ వ్యాప్తంగా సుమారుగా రూ.4.25 లక్షల కోట్ల టర్నోవర్ బిజినెస్ జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోనే ఏకంగా రూ. 75,000 కోట్ల వ్యాపారం అయ్యింది. దీనికి పోస్ట్ దీపావళి కస్టమర్ ఖర్చులు రూ1.25 లక్షల కోట్ల అదనం. దీంతో 2025 దీపావళిలో గత మార్కెట్ రికార్డులు బద్దలు కానున్నాయని చెప్పవచ్చు. మొత్తం మీదీ జీఎస్టీ తగ్గింపు వ్యాపారాలకు కొత్త ఊపునివ్వనుందని చెప్పవచ్చు.