SAIL Krishnamurthy: పబ్లిక్‌ రంగ పితామహుడు, సెయిల్‌ మాజీ ఛైర్మన్‌ కృష్ణమూర్తి కన్నుమూత..

SAIL Krishnamurthy: పబ్లిక్‌ రంగ పితామహుడిగా గుర్తింపు పొందిన వెంకటరామన్‌ కృష్ణమూర్తి కన్నుమూశారు.

Update: 2022-06-27 09:45 GMT

SAIL Krishnamurthy: నవ భారత నిర్మాణానికి బాటలు వేసి.. పబ్లిక్‌ రంగ పితామహుడిగా గుర్తింపు పొందిన డాక్టర్‌ వెంకటరామన్‌ కృష్ణమూర్తి కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 97 ఏళ్లు. దేశాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడంలో ఆయన పాత్ర మరువరానిది. ప్రభుత్వ రంగ అయిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో కానీ, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌-BHELలో కానీ, గ్యాస్ సంస్థ గెయిల్‌తో కానీ ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. భారత్‌ మహారత్నాలుగా చెప్పే సంస్థల్ని అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లారు.

BHEL ఛైర్మన్‌గా ఆయన వేసిన బాటలు ఇప్పటికీ మార్గదర్శకాలుగానే ఉన్నాయంటే.. డాక్టర్‌ కృష్ణమూర్తి ఎంతటి దార్శనికులో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటీనీ ఆయన లాభాల బాటలో నడిపించారు. అటు తర్వాత.. మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గానూ ఆయన విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో మారుతి 800 కారును ప్రవేశపెట్టింది కూడా కృష్ణమూర్తే. ప్రధాని అధ్యక్షతన ఉండే అనేక కమిటీల్లో కీలక సభ్యుడిగానూ సేవలు అందించారు. పారిశ్రామిరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ఆయన ఎంతో కృషి చేశారు.

తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతో మొదలుపెట్టి లాల్‌బదహూర్‌ శాస్త్రి, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్‌, రాజీవ్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ వరకూ.. అందరితోనూ వివిధ హోదాల్లో సన్నిహితంగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 2004 నుంచి 2008 వరకూ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్‌లోను, తర్వాత నేషనల్‌ మేనిఫ్యాక్చరింగ్‌ కాంపిటీటివ్‌నెస్‌ కౌన్సిల్‌లోను క్యాబినెట్‌ ర్యాంక్‌ హోదాతో 2014 వరకూ ఉన్నారు. అలాగే ఐఐఎం బెంగళూర్‌, ఐఐఎం ఆహ్మదాబాద్‌, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ భువనేశ్వర్‌తో పాటు పలు అగ్రశ్రేణి విద్యాసంస్థలకు ఛైర్మన్‌గా వ్యవహరించారు.

ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ అవార్డులు వరించాయి. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా, మార్గదర్శిగా నిలిచిన కృష్ణమూర్తి మరణం పట్ల ప్రముఖులంతా నివాళులు అర్పించారు. సెయిల్‌, BHEL లాంటి సంస్థలు కూడా CMDగా ఆయన సేవల్ని కీర్తిస్తూ ట్వీట్లు చేశాయి. ఆయన సెయిల్‌ ఛైర్మన్‌గా 1985 నుంచి 1990 వరకూ సేవలు అందించారు. ఆయనతో ప్రత్యక్షంగా పనిచేసినవారు, ఆయా ప్రభుత్వ రంగ సంస్థలతో అనుబంధం ఉన్నవారు.. కృష్ణమూర్తి మరణం తీరని లోటన్నారు. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని చెన్నైలోని మద్రాస్‌ క్లబ్‌ సమీపంలోని ఉన్న ఆయన ఇంట్లో అభిమానుల సందర్శన కోసం ఉంచారు.

సాయంత్రం బీసెంట్‌ నగర్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా కరువేలిలో 1925 జనవరి 14న కృష్ణమూర్తి జన్మించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఎయిర్‌ఫీల్డ్‌లో టెక్నీషియన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత సెయల్‌, BHEL, గెయిల్‌ లాంటి అత్యున్నత సంస్థల్లో పనిచేసిన అరుదైన గుర్తింపు ఆయన సొంతం. ప్రభుత్వ రంగ పితామహుడిగా ఆయన సేవల్ని పారిశ్రామికరంగ ప్రముఖులంతా స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

ఇండియన్‌ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ బెస్ట్‌ లీడర్‌ అంటే అది కృష్ణమూర్తేనని ఆయన్ను కీర్తిస్తున్నారు. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ట్రస్టీల్లో పద్మవిభూషణ్ కృష్ణమూర్తి ఒకరు. ఇ ఆయన మరణం పట్ల రాహుల్‌ సంతాపం తెలిపారు. దేశ నిర్మాణంలో ఆయన పాత్ర ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని ట్వీట్ చేశారు. TVS మోటార్ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ తన మెంటార్‌ను కోల్పోయానంటూ ఉద్వేగభరితమైన పోస్ట్ చేశారు. TVS కంపెనీని నేను నిలబెట్టడంలో, నిర్మించడంలో కృష్ణమూర్తి పాత్ర మరువలేనిది అంటూ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివన్నారు.

Tags:    

Similar News