Real Estate: ఆకాశాన్ని తాకుతున్న అపార్ట్‌మెంట్లు.. విల్లాలకూ పెరిగిన డిమాండ్

Real Estate: నగరంలో అపార్ట్‌మెంట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. పైగా ఎంత పైన ఉంటే అంత గాలి, వెలుతురు అని పై ఫ్లోర్లలో ఉండడానికే ఇష్టపడుతున్నారు నగర పౌరులు.

Update: 2021-11-14 04:30 GMT

Real Estate: నగరంలో అపార్ట్‌మెంట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. పైగా ఎంత పైన ఉంటే అంత గాలి, వెలుతురు అని పై ఫ్లోర్లలో ఉండడానికే ఇష్టపడుతున్నారు నగర పౌరులు. ఒకప్పుడు పది ఫ్లోర్లు ఉంటేనే అబ్బో ఎంత పైకి కట్టారో అని పైకి చూడాల్సి వచ్చేది.. మరి ఇప్పుడో.. ఆకాశాన్ని అందిపుచ్చుకున్న భావన కలుగుతుంది 50వ ఫ్లోర్ టెర్రాస్ పైన ఉంటే. ఆకాశమే హద్దుగా అన్నట్లు పశ్చిమ హైదరాబాద్‌లో 50 అంతస్తుల వరకు అపార్ట్‌మెంట్ నిర్మాణాలు చేపడుతున్నారు రియల్ వ్యాపారులు.

కోవిడ్ తర్వాత నెమ్మదిస్తుందనుకున్న మార్కెట్ కాస్తా ఈ మధ్య కాలంలో మరింత ఊపందుకుంది. పూర్వవైభవాన్ని సంతరించుకుంది. నగర శివార్లలో ఎక్కడ చూసినా విస్తారంగా కొత్త కొత్త ప్రాజెక్టులు, వెంచర్లతో మార్కెట్ కళకళలాడుతోంది. కస్టమర్లు కూడా కష్టపడి ఓ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.



అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకుని ముందడుగు వేస్తున్నారు. భూముల ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. గృహరుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గడంతో స్థిరాస్థిపై మదుపు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి, ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఆకాశహార్మ్యాలు, లగ్జరీ ప్రాజెక్టులు చేపడుతున్నారు రియల్టర్లు. గచ్చిబౌలి, కోకాపేట, నానక్‌రాంగూడ, నార్సింగి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నిర్మాణాలు వస్తున్నాయి. అటు బాచుపల్లి దాటి అవుటర్ వరకు భారీ ప్రాజెక్టులు వస్తుంటే.. ఇటు ఎల్‌బీనగర్, ఉప్పల్, పోచారం వైపు అపార్ట్‌మెంట్లు వస్తు్న్నాయి.

ఇక విల్లా కల్చర్ కూడా బాగా పెరిగిందనే చెప్పాలి. పటాన్‌చెరు, మేడ్చల్, తుక్కుగూడ, శంషాబాద్, బొంగ్లూరు, ఘట్‌కేసర్ చుట్టుపక్కల విల్లాలు నిర్మిస్తు్న్నారు. గచ్చబౌలి నుంచి శంకర్‌పల్లి, పటాన్‌చెరు మార్గంలో పెద్ద సంఖ్యలో విల్లాలు వస్తున్నాయి.

బండ్లగూడ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోనూ, తుర్కయాంజాల్, అత్తాపూర్ వంటి చోట్ల కూడా విల్లాల నిర్మాణం చేపడుతున్నారు. అవుటర్ వరకు నగరం విస్తరించిన చోట అపార్ట్‌మెంట్లు, విల్లాలు, టౌన్‌షిప్పులతో రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది.

Tags:    

Similar News