Sugar Production : చక్కెర మిల్లుల్లో కోలాహలం.. రికార్డు స్థాయికి చేరిన షుగర్ ఉత్పత్తి.. ధరలు తగ్గేనా?
Sugar Production : ఈ ఏడాది భారతదేశంలో చక్కెర ఉత్పత్తి ఆశాజనకంగా సాగుతోంది. అక్టోబర్ 1 నుంచి మార్చి 15 వరకు జరిగిన ఉత్పత్తి గణాంకాలను పరిశీలిస్తే, దేశీయ చక్కెర మిల్లులు ఏకంగా 26.18 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెరను ఉత్పత్తి చేశాయి. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ విడుదల చేసిన డేటా ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్పత్తిలో 10.4 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా దేశంలోని అగ్రగామి చక్కెర ఉత్పత్తి రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఉత్తరప్రదేశ్ లలో దిగుబడి పెరగడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రాల వారీగా చూస్తే, పశ్చిమ రాష్ట్రమైన మహారాష్ట్ర అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అక్కడ ఉత్పత్తి 7.86 మిలియన్ టన్నుల నుంచి ఏకంగా 9.85 మిలియన్ టన్నులకు పెరిగింది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కూడా 17.1 శాతం పెరుగుదలతో ఉత్పత్తి 4.58 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్వల్ప వృద్ధి నమోదైంది. గత ఏడాది 8.1 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి, ఈసారి 8.15 మిలియన్ టన్నులకు చేరింది. అయితే ఈ సీజన్ లో కార్యకలాపాలు ప్రారంభించిన 533 మిల్లులలో ఇప్పటికే 333 మిల్లులు తమ క్రషింగ్ సీజన్ ను ముగించుకుని మూతపడ్డాయి.
మరోవైపు ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ (AISTA) ఈ ఏడాది మొత్తం ఉత్పత్తిపై అంచనాలను విడుదల చేసింది. సెప్టెంబర్ తో ముగిసే ప్రస్తుత సీజన్ లో భారత్ మొత్తం 28.3 మిలియన్ టన్నుల చక్కెరను ఉత్పత్తి చేయగలదని అంచనా వేస్తున్నారు. అంతకుముందు 29.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని భావించినా, మారిన పరిస్థితుల దృష్ట్యా దీనిని స్వల్పంగా తగ్గించారు. దేశీయ అవసరాలకు సరిపడా చక్కెర నిల్వలు ఉండటంతో పాటు, ప్రభుత్వం కొన్ని పరిమితులకు లోబడి ఎగుమతులకు కూడా అనుమతి ఇచ్చింది.
ఎగుమతుల విషయానికి వస్తే, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో భారతీయ మిల్లులు సుమారు 3.15 లక్షల టన్నుల చక్కెరను విదేశాలకు పంపాయి. మన దేశం నుండి చక్కెరను కొనుగోలు చేస్తున్న దేశాల్లో ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అఫ్గానిస్థాన్, జిబౌటి, టాంజానియా మరియు శ్రీలంక ఉన్నాయి. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో మొత్తం 2 మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అంతర్జాతీయ మార్కెట్ లో భారతీయ చక్కెర ధరలు స్థిరంగా ఉండటం, ఉత్పత్తి పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.