VinFast : ఓలా, టీవీఎస్‌లకు గట్టి పోటీ.. విన్‌ఫాస్ట్ నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.
VinFast : వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఇప్పుడు భారత్‌పై కన్నేసింది. ఇప్పటికే మన దేశంలో VF6, VF7 వంటి ఎలక్ట్రిక్ కార్లతో సంచలనం సృష్టించిన ఈ కంపెనీ, త్వరలోనే 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే, తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. విన్‌ఫాస్ట్ కేవలం కార్లకే పరిమితం కాకుండా, భారత్‌లో అత్యంత డిమాండ్ ఉన్న ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
వియత్నాం మార్కెట్లో విన్‌ఫాస్ట్ కేవలం కార్లే కాకుండా ఎలక్ట్రిక్ బస్సులు, స్కూటర్లను కూడా విక్రయిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల విక్రయాలు ఏడాదికి 4 లక్షల యూనిట్లను దాటిపోయాయి. ఈ భారీ డిమాండ్‌ను చూసి, తన గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలోని అత్యుత్తమ స్కూటర్లను ఇండియాలో లాంచ్ చేయాలని విన్‌ఫాస్ట్ నిర్ణయించుకుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం.. 2026 రెండో అర్ధభాగంలో ఈ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్‌లో ఈ లాంచ్ ఉండబోతోందని సమాచారం.
రాబోతున్న ఆ 3 మోడళ్లు ఇవేనా?
విన్‌ఫాస్ట్ వియత్నాం మార్కెట్లో ప్రస్తుతం వెరో, వైపర్, ఫెలిజ్, ఈవో వంటి స్కూటర్లను అమ్ముతోంది. భారత్‌లో మాత్రం Evo, Feliz, Viper అనే మూడు మోడళ్లను ముందుగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటిలో ఈవో క్లాసిక్ లుక్‌తో ఉంటే, ఫెలిజ్, వైపర్ మోడళ్లు స్టైలిష్ అండర్-బోన్ డిజైన్‌తో స్పోర్టీగా కనిపిస్తాయి. ఈ స్కూటర్లు సింగిల్ ఛార్జ్‌తో 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తాయని సమాచారం. ఇది భారతీయ వినియోగదారులకు అతిపెద్ద ప్లస్ పాయింట్ కానుంది.
విన్‌ఫాస్ట్ తన స్కూటర్లను CKD (Completely Knocked Down) రూట్‌లో భారత్‌కు తీసుకువస్తుంది. అంటే విదేశాల నుంచి విడిభాగాలను తెచ్చి, ఇక్కడే అసెంబుల్ చేస్తారు. ఇందుకోసం తమిళనాడులోని తూత్తుకుడిలో కంపెనీ ఏర్పాటు చేస్తున్న భారీ తయారీ ప్లాంట్‌ను ఉపయోగించుకోనుంది. ఇదే ప్లాంట్‌లో కంపెనీ తన ఎలక్ట్రిక్ కార్లను కూడా తయారు చేయనుంది. స్థానికంగా అసెంబ్లీ చేయడం వల్ల స్కూటర్ల ధరలను పోటీగా ఉంచే అవకాశం ఉంటుంది.
పోటీ ఎవరితో అంటే?
విన్‌ఫాస్ట్ స్కూటర్లు మార్కెట్లోకి వస్తే ప్రధానంగా బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 వంటి దిగ్గజ మోడళ్లతో పోటీ పడాల్సి ఉంటుంది. భారతీయ రోడ్లు, ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ స్కూటర్లలో కొన్ని కీలక మార్పులు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. క్వాలిటీ, రేంజ్ విషయంలో విన్‌ఫాస్ట్ రాజీ పడకపోతే, భారత ఈవీ మార్కెట్లో ఆ కంపెనీ రారాజుగా మారడం ఖాయం.