Electric Cars : ఎలక్ట్రిక్ కార్లు పెట్రోల్ కార్ల కంటే 40 శాతం ఎక్కువ వెయిట్ ఉండటానికి అసలు కారణం ఇదే.
Electric Cars : ప్రస్తుతం ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తోంది. అయితే ఈ కార్లను నడిపే వారికి లేదా కొత్తగా కొనాలనుకునే వారికి తరచుగా వచ్చే సందేహం ఒకటుంది.. అదేంటంటే, "సాధారణ పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లు ఎందుకు అంత బరువుగా ఉంటాయి?" అసలు ఈ బరువు పెరగడం వల్ల లాభమా లేక నష్టమా? ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
బరువుకు ప్రధాన కారణం - బ్యాటరీ ప్యాక్
ఎలక్ట్రిక్ వాహనాలు ఇంత భారీగా ఉండటానికి ప్రధాన కారణం వాటిలో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్. సాధారణ కార్లలో ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్ ఉంటాయి. కానీ ఈవీలలో భారీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఉదాహరణకు, 50 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ బరువు దాదాపు 300 నుంచి 500 కిలోల వరకు ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ బరువు 1,577 కిలోలు ఉంటే, అది దాని పెట్రోల్ వెర్షన్ కంటే 35 శాతం ఎక్కువ. అలాగే కారెన్స్ క్లావిస్ ఈవీ కూడా దాదాపు 40 శాతం అదనపు బరువుతో వస్తోంది.
బరువును తగ్గించేందుకు కంపెనీల ప్రయత్నాలు
బరువు పెరగడం వల్ల రేంజ్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలు బరువును తగ్గించేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి. సాంప్రదాయ ఉక్కుకు బదులుగా ప్లాస్టిక్, గ్లాస్ ఫైబర్ వంటి తేలికపాటి, పటిష్టమైన కంపోజిట్ మెటీరియల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. కారులోని ఆడియో సిస్టమ్స్, స్పీకర్లను కూడా తేలికపాటి పరికరాలతో మారుస్తున్నారు. తద్వారా కారు బ్యాటరీ ఎఫిషియన్సీ పెరిగి, ఎక్కువ దూరం ప్రయాణించే వీలు కలుగుతుంది.
ఎక్కువ బరువు వల్ల కలిగే నష్టాలు
కారు బరువు పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. భారీ బరువు వల్ల బ్రేకులు వేసినప్పుడు కారు ఆగడానికి కొంత ఎక్కువ దూరం తీసుకుంటుంది. అంతేకాకుండా, రోడ్డుపై టైర్ల రాపిడి ఎక్కువగా ఉండటం వల్ల ఈవీలలో టైర్లు త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే, మలుపులు తిరిగేటప్పుడు పెట్రోల్ కార్లంత వేగంగా ఇవి స్పందించకపోవచ్చు.
భారీ బరువు వల్ల కలిగే లాభాలు
అయితే, బరువు పెరగడం వల్ల కొన్ని ఊహించని లాభాలు కూడా ఉన్నాయి. భారీ బ్యాటరీ కారు అడుగు భాగంలో ఉండటం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ కిందకు ఉంటుంది. దీనివల్ల కారు రోడ్డుపై చాలా స్థిరంగా ఉంటుంది, వేగంగా వెళ్తున్నప్పుడు పల్టీలు కొట్టే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అలాగే భారీ వాహనాలు ప్రమాదం జరిగినప్పుడు లోపల ఉన్న ప్రయాణికులకు మెరుగైన భద్రతను ఇస్తాయి. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల బరువు ఎక్కువ ఉన్న వాహనాలు ఎక్కువ శక్తిని తిరిగి బ్యాటరీకి పంపగలుగుతాయి. వెరసి, ఈ అదనపు బరువు కొన్ని విషయాల్లో ఇబ్బంది కలిగించినా, సేఫ్టీ మరియు స్టెబిలిటీ పరంగా వరంగా మారుతోంది.