సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన మూవీ రాకాస. కొణెదల నిహారిక నిర్మించిన ఈ చిత్రానికి మానస శర్మ దర్శకురాలు. ఆ మధ్య విడుదలైన టీజర్ బాగా ఆకట్టుకుందీ మూవీ నుంచి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అందమైన మెలోడియస్ సాంగ్ విడుదల చేసింది టీమ్. మామూలుగా సంగీత్ కు వచ్చిన ఇమేజ్ కు భిన్నంగా ఉందీ పాట. ఆ పాటలోని సాహిత్యం, సంగీతం చాలా చాలా బావుంది.
‘అలా అలా దారీ నీవైపుగా మారి.. సరాసరి నిన్నే చేరనా.. మరీ మరీ నీతో ఉండాలని కోరి.. మనసును రాసి ఇవ్వనా.. కళ్లు మూస్తూ ఉన్నా నిన్నే చూస్తున్నా.. నీ కన్నుల్లో నన్నే వెతుకనా వెతకనా.. దాచుకోలేనంత ప్రేమ నాపైనా నువ్వే కురిపించినా..’ అంటూ పల్లవితోనే బాగా ఆకట్టుకుందీ పాటలో. మామూలుగా హీరోలపై మనసు పారేసుకున్న హీరోయిన్లపై వచ్చే ప్రేమలు బాగా అరుదుగా కనిపిస్తాయి. మన దగ్గర ఎక్కువగా హీరోయిన్లపై మనసు పారేసుకున్న పాటలే ఎక్కువగా వస్తాయి. అలాంటిది ఇలాంటి బ్యూటీఫుల్ సాంగ్ తో బాగా మెప్పించేలాంటి గీతంతో రావడం మాత్రం మెచ్చుకోదగ్గదే. మొత్తంగా ఈ పాట మాత్రం చాలా బావుంది.
‘మాటల్లో తెలిపేటి వీలుందా?
మౌనంలో మాటే వినిపిస్తోందా?
ఆనాటి స్నేహంలో తీపంతా
ఈనాటి ప్రేమల్లే మారిందా..’ ఇది రెండో చరణంలో వినిపించిన సాహిత్యం. సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది కదా.
ఇక ఈ మూవీకి సంగీతాన్ని అందించింది అనుదీప్ దేవ్. ఈ పాటను పాడింది సింధుజా శ్రీనివాసన్, సాహిత్యం కిట్టు విస్సాప్రగడ అందించాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేయబోతున్నారు.