రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ ‘ద గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి నదివే అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం నుంచి విడుదలైన ఈ పాట వినగానే ఆకట్టుకునేలా ఉంది. తను ప్రేమించి ఓ అమ్మాయిలోని బిడియాన్ని పోగొట్టేలా ఓ యువకుడు ఆమెకు ఉద్బోద చేస్తున్నట్టుగా కనిపిస్తోన్న ఈ పాటలో .. అర్థవంతమైన సాహిత్యం ఉంది. ‘శిలువ బరువు మోయగా సులువు భవితే లేదుగా ’అనే లైన్ చాలు.. ఈ పాటలో ఎంత డెప్త్ ఉందో అర్థం చేసుకోవడానికి. ఈ పాటను రాకేందు మౌళి రాశాడు.
ఇక పాటలో కొరియోగ్రాఫ్ చేసిన డ్యాన్సులు మాత్రం పాటకు, సాహిత్యానికి సంబంధం లేకుండా కనిపిస్తున్నాయి. అయితే కథనం పరంగా సాగే పాటలా ఉంది కాబట్టి.. ఆ ఇద్దరూ కలిసి ఆ డ్యాన్స్ కు ప్రిపేర్ అవుతున్నారేమో అనుకోవచ్చు. ‘వెలుగారునా నిశి పూసినా.. వెలివేసినా మది వీడునా.. గుండె కనుమూసినా విధిరాసినా కల కారిపోవు నిజమైనా.. నిను వదలకుమా.. బెదురెరుగని బలమా.. నదివే.. ’ అంటూ మొదలైన పాట ఇది. అంటే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నదిలా నిలకడా ప్రవహించాలి అనే అర్థంలో పాటంతా కనిపిస్తోంది. మొత్తంగా మంచి ఆర్కెస్ట్రైజేషన్ తో సింపుల్ గా ఆకట్టుకుంటోంది ఈ పాట. విశేషం ఏంటంటే.. ప్రస్తుతం రష్మిక నేషనల్ క్రష్ కాబట్టి ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం అనేలా అన్ని భాషల్లోనూ ఈ పాటను విడుదల చేశారు.