ఒకప్పుడు సౌత్ హీరోలకు బాలీవుడ్ అంటే బలే మోజు. అక్కడ హీరోలుగా రాణించాలని.. హిందీలోనూ హీరోలుగా జెండా ఎగరేయాలని తెగ తాపత్రయపడిపోయేవారు. రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల్ .. ఇలా ఎవరికి వారు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరూ సక్సెస్ కాలేదు. ఉన్నంతలో కమల్ హాసన్ కాస్త బెటర్. కట్ చేస్తే ఈ జెనరేషన్ లో ఆ ప్రయత్నం మొదట చేసినవాడు రామ్ చరణ్. మగధీర వంటి ప్యాన్ ఇండియా రేంజ్ ఉన్న మూవీ చేసిన చరణ్.. కొంత గ్యాప్ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ మూవీ జంజీర్ రీమేక్ లో నటించాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ఆ మూవీని తెలుగులో తుఫాన్ పేరుతో డబ్ చేశారు. బట్ తుఫాన్ వేగంతో రెండు భాషల్లోనూ డిజాస్టర్ గా తేలిపోయింది ఈ మూవీ. ఆ తర్వాత చరణ్ మళ్లీ బాలీవుడ్ ఊసే ఎత్తలేదు. అలాగే ఈ తరం హీరోలు కూడా. అన్నట్టు ఆ మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతిని బాలీవుడ్ లో రీమేక్ చేసి భంగపడ్డాడు.
ఇక తాజాగా ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ తో అతనికి ప్యాన్ ఇండియా రేంజ్ లో ది బెస్ట్ ఆర్టిస్ట్ అనే పేరు వచ్చింది. స్టార్డమ్ కూడా తెచ్చిందా మూవీ. ఆ స్టార్డమ్ తోనే పెద్దగా కథాబలం లేని దేవర తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. దీన్ని ఇలా కొనసాగించి ఉంటే బావుండేది. బట్ అతనికీ బాలీవుడ్ పురుగు కుట్టినట్టు ఉంది. అందుకే వార్ 2లోకి ఎంటర్ అయ్యాడు. మామూలుగానే వార్ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. దానికి కంటిన్యూషన్ అంటే కాస్త ఆలోచించుకోవాలి. ఈ విషయంలో ఎన్టీఆర్ జడ్జిమెంట్ రాంగ్ అని ఈ మూవీ రిజల్ట్ చెబుతోంది. అసలు బాలీవుడ్ డెబ్యూ అంటే మల్టీస్టారర్ అనేదే రాంగ్ స్టెప్. అందునా.. ఇలాంటి వీక్ స్టోరీ ఉన్న మూవీతో అంటే ఇంక చెప్పేదేముందీ. అందుకే రామ్ చరణ్ తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్ నుంచి షాక్ తిన్నది ఎన్టీఆరే అని చెప్పాలి.
ఇలాంటివి చెబితే ఎన్టీఆర్ అభిమానులకు కోపం వస్తుందేమో.. కానీ నిజంగా మాట్లాడితే వార్ 2లో ఎన్టీఆర్ కాలిబర్ ను దర్శకుడు వాడుకున్నాడా..? అసలు అలాంటి హీరోతో ఇలాంటి పాత్ర చేయించడం.. దానికి ఎన్టీఆర్ ఒప్పుకోవడం ఎంత వరకు కరెక్ట్..? పైగా వీక్ గా ఉన్న విజువల్ ఎఫెక్ట్స్, ట్రోల్ అవుతున్న ఎన్టీఆర్ షర్ట్ లెస్ ఫోటోస్.. ఓ రకంగా చూస్తే ఈ మూవీ రిలీజ్ కు ముందు ఎన్టీఆర్ కు చూపించలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఏదేమైనా మనవాళ్లు.. మనవైన కథలతో పక్క భాషలను మెప్పిస్తే ప్యాన్ ఇండియా స్టార్స్ గా రాణిస్తారు. ఇలా అన్ని భాషల్లోకి వెళితే ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకు రామ్ చరణ్ తర్వాత ఎన్టీఆర్ మరో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
కాకపోతే ఉన్నంతో ఊరట ఏంటంటే.. ఈ మూవీకి ఈ మాత్రం కలెక్షన్స్ వస్తున్నాయంటే కూడా కేవలం ఎన్టీఆర్ మాత్రమే కారణం.