సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన తర్వాత హీరోగా వచ్చాడు రమేష్ బాబు. చాలా హ్యాండ్సమ్ అన్న పేరు వచ్చినా సినిమాలు ఆడలేదు. ఆ కారణంగా చాలా త్వరగానే హీరోగా నటనకు ఫుల్ స్టాప్ పెట్టాడు రమేష్ బాబు. తర్వాత వచ్చిన మహేష్ బాబు.. తండ్రికి తగ్గ తనయుడుగా సూపర్ స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. త్వరలోనే ప్యాన్ వరల్డ్ ఆడియన్స్ కు రాజమౌళి మూవీతో పరిచయం కాబోతున్నాడు. ఆయన తర్వాత గౌతమ్ కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనుకున్నారు. బట్ గౌతమ్ కంటే ముందే సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరో అవుతున్నాడు. ఈ కుర్రాడూ వారసత్వంగా వచ్చిన అందంతోనే అడుగుపెట్టబోతున్నాడు.
ఇక జయకృష్ణను హీరోగా లాంచ్ చేసే బాధ్యతను ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతికి ఇచ్చారు. స్టార్ హీరోల వారసులను పరిచయం చేస్తూ వారినీ స్టార్స్ గా మార్చడంలో ఎక్స్ పర్ట్ అనిపించుకున్న అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం. మహేష్ బాబను పరిచయం చేసింది కూడా అశ్వనీదతే. ఇప్పుడు రమేష్ బాబు తనయుడినీ టాలీవుడ్ కు అందించబోతున్నాడు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ ను అఫీషియల్ గా చెప్పబోతున్నారు.