రివ్యూ : హే బల్వంత్
ఆర్టిస్ట్స్ : సుహాస్, శివానీ నాగారం, నరేష్ విజయకృష్ణ, సుదర్శన్, అన్నపూర్ణ, బాబు మోహన్, హర్ష వర్ధన్ తదితరులు
ఎడిటర్ : విప్లవ్ నైషధం
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : మహి రెడ్డి పండుగుల
నిర్మాత : బి. నరేందర్ రెడ్డి
దర్శకుడు : గోపీ ఆచంట
హే భగవాన్ అనే టైటిల్ మార్చాలని సెన్సార్ వాళ్లు చెప్పారు. దీంతో వీళ్లు హే బల్వంత్ అనే టైటిల్ పెట్టారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో సుహాస్, శివానీ జంటకు బాగా పేరొచ్చింది. ఇన్ని రోజుల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుందంటే అందరిలోనూ ఆసక్తి ఉంది. మంచి ప్రమోషన్స్ తో ఆకట్టుకుంది టీమ్. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
కృష్ణ (సుహాస్) ఎమ్.బి.ఏ చదువుకుంటాడు. తన తండ్రి బల్వంత్ (నరేష్) చేసే బిజినెస్ లోకి తను దిగాలనుకుంటాడు. కానీ అతని బిజినెస్ ఏంటీ అనేది మాత్రం అతనికి చెప్పడు తండ్రి. కృష్ణకి మిత్ర ( శివానీ) పరిచయం అవుతుంది. ఆమె ఓ ఎన్.జి.వోలో పనిచేస్తుంటుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమలో పడతారు. అయితే కృష్ణకి బల్వంత్ బిజినెస్ ఏంటీ అనేది తెలుస్తుంది. దీంతో అతను షాక్ తింటాడు. ఆ బిజినెస్ లో చాలా సమస్యలుంటాయి. దీంతో అతను సతమతం అవుతుంటాడు. అదే టైమ్ లో మిత్రకు కూడా అతని బిజినెస్ ఏంటో తెలుస్తుంది. దీంతో అతన్ని అసహ్యించుకుంటుంది. అతనికి ఆమెకి ఓ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. ఈ క్రమంలో ఆమె.. అతని వ్యాపారం చేసే ప్లేస్ కు వెళుతుంది. అక్కడికి వెళ్లాక ఆమెకు ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలేంటీ..? ఆ షాకింగ్ విషయం వెనక ఆమె తండ్రి రాజకీయాలకు ఎలా ముడిపడి ఉంటుంది.. అదే రాజకీయాల్లో ఓ రౌడీ కూడా ఎలా ఎంటర్ అయ్యాడు అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
ఇలాంటి కథను సెలెక్ట్ చేసుకున్నందుకు సుహాస్ ను మెచ్చుకోవాలి. అలాగే నరేష్ పాత్ర హైలెట్ కావడం చాలా ప్లస్ అవడం సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సాధారణంగా సాగే సన్నివేశాలున్నా.. సుదర్శన్ కామెడీ అదిరిపోతుంది. వెన్నెల కిశోర్ కూడా మెప్పించాడు. అయితే ఎప్పుడైతే అతనికి బిజినెస్ వ్యవహారాలు తెలియడంతో.. అక్కడి నుంచి కథనం కలగా పులగంగా అవుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ లో సాధారణమైన సన్నివేశాల్లో కూడా బాగా మెప్పించే కామెడీ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం అంతా అదో రకంగా అయిపోతుంది. తలా తోక లేని సన్నివేశాలుగా వస్తుంటాయి. అయినా అందులోనూ నరేష్ క్యారెక్టర్ హైలెట్ అవడం ప్లస్ అవుతుంది. ఆ బిజినెస్ వెనక ఉన్న సాగే సన్నివేశాలు చాలా సాధారణంగా ఉంటూనే అందులో లోతైన భావాలూ ప్రతిబింబిస్తుంటాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సుహాస్ పాత్ర పూర్తిగా తేలిపోయినట్టుగానే ఉంటుంది. నరేష్, అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్ లు అతన్ని పూర్తిగా డామినేట్ చేశారు. శివానీ పాత్ర కూడా అంతే. దీంతో పాటు ఆమెతో పాటు ఉండే కొంతమంది మహిళల క్యారెక్టర్స్ కూడా బావుంటాయి. అలాంటిదే అయినా స్రవంతి చొక్కారపు, వెన్నెల కిశోర్ పాత్రలు చాలా బావున్నాయి. ఓవరాల్ గా చూస్తే ఈ బిజినెస్ ఏంటీ అనేది మాత్రం ఈ రివ్యూలో చెప్పడం కుదరదు. ఆ కారణంగా మరింతగా వివరించే అవకాశం లేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఉండేంత కామెడీ సెకండ్ హాఫ్ లో కనిపించదు. సడెన్ గా సినిమా అంతా సీరియస్ అయ్యే అవకాశం లాస్ట్ పావుగంటలో రావడం మైనస్ అయింది. చివర్లో వాళ్లందరినీ సెటిల్ చేసిన విధానం కూడా ఏదో హడావిడీగా సాగినట్టుగా ఉంటుంది. మొత్తంగా ఇదో మంచి వినోదాత్మకమైన కథనంతో మెప్పించే ప్రయత్నంలా ఉంది.
సుహాస్ పాత్ర చాలా సింపుల్ గా ఉంది. నటనకు పెద్దగా ఆస్కారం లేదు. మేకప్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది అనిపించాడు. హీరోయిన్ గా శివానీ నటన బావుంది. నరేష్ హైలెట్ అయ్యాడు. సుదర్శన్ పాత్ర ఆద్యంతం నవ్వించేదే. వెన్నెల కిశోర్, అన్నపూర్ణ, హర్షవర్థన్ లు బాగా ఆకట్టుకున్నారు.
టెక్నికల్ గా సంగీత పరంగా పాటలంత గొప్పగా ఏం లేవు. నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బావుంది. డైలాగ్స్ చాలా బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు గోపీ ఆచంటలో చాలా విషయం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. వైవిధ్యమైన కథతో పాటు కామెడీ కూడా పండించిన విధానం బావుంది. భవిష్యత్ లో మంచి దర్శకుడు అనిపించుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి.
ఫైనల్ గా : హే.. నవ్వించారు
రేటింగ్ : 2.75/5
బాబురావు. కామళ్ల