గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్.. ఫ్యాన్స్ కు మజానిచ్చేలా..

Update: 2025-04-07 11:00 GMT

అజిత్ కుమార్ నటించిన సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ నెల 10న విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీస్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటించింది. సిమ్రన్ ఓ కీలక పాత్ర చేసింది. ఆ మధ్య తమిళ్ ట్రైలర్ విడుదలైంది. తాజాగా తెలుగు, హిందీ ట్రైలర్స్ ను విడుదల చేశారు. ఇప్పటికే చాలామంది తమిళ్ ట్రైలర్ చూసి ఉన్నారు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండటంతో పెద్దగా ఇబ్బంది కాలేదు. ఇక తెలుగు ట్రైలర్ భాష ఎలా ఉంది.. డబ్బింగ్ ఎలా చేశారు అనేది చూస్తారు. ఈ విషయంలో ట్రైలర్ వరకూ ఫర్వాలేదు అనే చెప్పాలి. కాకపోతే చాలా రొటీన్ కంటెంట్ తో వస్తున్నారేమో అనిపిస్తోంది. ట్రైలర్ లో ఓ డైలాగ్ ఉంది.. ‘దమ్ము నాకోసం వదిలేశాను.. మందు నా భార్య కోసం వదిలేశాను.. వయొలెన్స్ నా కొడుకు కోసం వదిలేశాను.. నా కొడుక్కే ప్రాబ్లమ్ వస్తే వదిలేసింది తిరిగి తీసుకుంటా కదా..’ అని. దీన్ని బట్టి ఇదో రివెంజ్ డ్రామా అనుకోవచ్చు. గుడ్ బ్యాడ్ అగ్లీ అనేది కొన్ని దశాబ్దాల క్రితం వచ్చిన క్లాసిక్ వెస్ట్రన్ మూవీ టైటిల్. ఇదో ఎవర్ గ్రీన్ సినిమా. అలాంటి టైటిల్ తో వస్తోన్న మూవీ కాబట్టి ఆ స్థాయి కంటెంట్ ఉంటుంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే అనేలా ఉంది ట్రైలర్ చూస్తుంటే. కేవలం ఎలివేషన్స్, ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా భారీ గన్స్, కాల్పుల మోత అన్నట్టుగానే ఉంది. ఆల్రెడీ ఈ యేడాది పట్టదల మూవీతో బిగ్ డిజాస్టర్ చూసి ఉన్నాడు అజిత్. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీతో వస్తున్నాడు. బట్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోతోందీ మూవీ. ఇక ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే భరించలేకుండా ఉంది.

ఇక ఈ సినిమాలో భారీ తారాగణమే కనిపిస్తోంది. అర్జున్ దాస్, సునిల్, జాకీ ష్రాఫ్, సిమ్రన్, ప్రియా ప్రకాష్, ప్రభు, ప్రసన్న, యోగిబాబు, రాహుల్ దేవ్, కేజీఎఫ్ అవినాష్.. ఇలా చాలామందే కనిపిస్తున్నారు. జివి ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని ఆధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశాడు. మరి ఈ మూవీతో అజిత్ కుమార్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. కాకపోతే ట్రైలర్ చూస్తుంటే ఇది పూర్తిగా అజిత్ ఫ్యాన్స్ కోసం రూపొందించిన సినిమాలా ఉందంటే అతిశయోక్తి కాదు. మరి మిగతా ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చుతుందో కానీ.. ఫ్యాన్స్ కైతే ఫీస్ట్ అవుతుందేమో.

Full View

Tags:    

Similar News