కొన్నాళ్లుగా బాలీవుడ్ కమర్షియల్ సక్సెస్ లు లేక సంక్షోభం ఎదుర్కొంటోంది. ఛావా కాస్త గట్టెక్కించింది. హిస్టారికల్ మూవీస్ కు తమదైన శైలిలో మాస్ మసాలాతో పాటు కాస్త దేశభక్తిని కూడా రంగరించి రూపొందిస్తోన్న సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయక్కడ. ఆ కోవలో అని చెప్పలేం కానీ.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వారు చేసిన అత్యంత హేయమైన చర్యగా చెప్పుకునే జలియన్ వాలా బాగ్ ఘటన నేపథ్యంలో ఇప్పుడు అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ నెల 18న విడుదల కాబోతోన్న ఆ మూవీ పేరు ‘కేసరి చాప్టర్ 2’. తాజాగా కేసరి 2 ట్రైలర్ విడుదలైంది.
1919 ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్ ఘటన జరిగింది. ఆ రోజున అక్కడ ఉన్న నిరాయుధులైన భారతీయులపై బ్రిటీష్ సైన్యం జనరల్ డయ్యర్ సారథ్యంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో నాటి బ్రిటీష్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది చనిపోయారు. కానీ మరణాల సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెబుతారు. ఆ ఘటన నేపథ్యంలో జనరల్ డయ్యర్ పై కేస్ వేసి కోర్ట్ లో వాదించే లాయర్ గా అక్షయ్ కుమార్ కనిపించబోతున్నాడు. ట్రైలర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. విశేషం ఏంటంటే డయ్యర్ నిర్దోషి అని చెబుతూ వాదించే లాయర్ గా మాధవన్ నటించాడు. ఈ ఇద్దరి మధ్య కోర్ట్ లో వాదోపవాదాలు సినిమాకు కీలకంగా కనిపించబోతున్నాయి.
మరి ఈ కేస్ లో జనరల్ డయ్యర్ ను కేసరి దోషిగా నిరూపించాడా లేదా అనేది పక్కన పెడితే అతనెంత క్రూరుడు అనేది ఎలివేట్ చేశాడు అనేలా ఉంది ట్రైలర్. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలను టెర్రరిస్ట్ లుగా చిత్రీకరిస్తూ మాధవన్ వాదనలు ఇండియన్ ఆడియన్స్ లో రక్తం మరిగేలా చేస్తాయనడంలో డౌటే లేదు. అలాగే మాధవన్ పాత్రకు సంబంధించిన ఎలివేషన్ ట్రైలర్ లోనే హైలెట్ గా ఉంది. మొత్తంగా అక్షయ్ కుమార్ ఈ సారి గ్యారెంటీ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని కరణ్ సింగ్ త్యాగి డైరెక్ట్ చేశాడు. అక్షయ్ కుమార్, మాధవన్ తో పాటు అనన్య పాండే మరో కీలక పాత్రలో నటించింది. సో.. ఈ నెల 18న విడుదలవుతోన్న కేసరి చాప్టర్ 2 ఎలాంటి రిజల్ట్ అందుకుటుందో చూడాలి.