ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ (94) శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కనకరత్నమ్మ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నాయి. ఈ విషాద వార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్ షూటింగ్ నిమిత్తం మైసూర్, ముంబైలో ఉన్నారు. వారు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం.
కనకరత్నమ్మ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు అల్లు అరవింద్ నివాసానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.