తెలుగు సినీ కళామతల్లి కిరీటం నుంచి ఒక మణిమకుటం మాయమైంది. నవరస నటనకు నిలువెత్తు రూపం అదృశ్యమైంది. తెలుగు సినిమాకే ఆభరణమై నిలిచిన ఆ నటన ఆవిరైంది. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, నాగభూషణం.. ఇలా తెలుగు సినిమా సగర్వంగా చెప్పుకున్న నటుల సరసన అంతే గర్వంగా చెప్పుకోవాల్సిన పేరు కోట శ్రీనివాసరావు. కోట తర్వాత ఆ స్థాయి నటుడు అని చెప్పుకోవడానికి ఇప్పటి వరకూ తెలుగు సినిమాకు మరో నటుడు దొరకలేదు. అదీ ఆయన స్థాయి. ఆయన మరణం నట ప్రపంచానికే తీరని లోటు. అది ఇంకెవరూ పూడ్చలేని అగాథం.
అరుదైన నటుడు, విలక్షణ నటుడు, సంపూర్ణ నటుడు.. ఇలా నటుల ప్రతిభను ఎత్తి చూపే మాటలు ఎన్ని ఉన్నా.. ఆ అన్ని పదాలకు అర్హుడైన నటుడు కోట శ్రీనివాసరావు. పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడం.. పాత్రగా ప్రవర్తించడం.. ఆ పాత్రలను సంపూర్ణంగా ఆవిష్కరించడం.. ఇదీ ఆయన శైలి. అదే అనతి కాలంలోనే అత్యున్నత నటుడుగా తీర్చిదిద్దాయి. నిరంతర విద్యార్థిగా, ప్రతి సినిమానూ మొదటి సినిమాగానే భావించే నైజం కోటది. తనకు పోటీగా ఎవరైనా ఉన్నారంటే అక్కడ విశ్వరూపం చూపిస్తారు. ప్రతి సన్నివేశంలో తన నటనే హైలెట్ అవ్వాలనే కాంక్షే ఆయన్ని ఓ గొప్ప నటుడుగా మార్చింది. ఇలాంటి ఓ సంపూర్ణ నటుడిని కోల్పోయిన తెలుగు సినిమా ఎప్పటికీ తీరని వేదనకు గురవుతుందని చెప్పొచ్చు.
పాత్ర పాతదే అయినా...దాన్ని కొత్తగా ప్రజంట్ చేయడానికి తాపత్రయపడే నటుడు కోట.ఎన్నో సినిమాల్లో భిన్నమైన పాత్రలు చేసి మెప్పించిన ఘనత ఆయనది. అంతకుముందు రంగస్థలం మీద సుదీర్ఘానుభవం ఉండడంతో ఎలాంటి సిట్యుయేషన్ లో అయినా దూసుకెళ్లిపోయేవారు. క్రూయల్ విలనీ..కామెడీ విలనీ...కారక్టర్ రోల్స్ ఇలా...ఇచ్చిన పాత్రకు నూటయాభై శాతం న్యాయం చేసే నటుడు కోట.
కంకిపాడు ఓ స్మాల్ విలేజ్ ఇన్ క్రిష్ణా డిస్ట్రిక్ట్. కార్ట్స్ ప్రింటెడ్..మేటర్ సేమ్...బట్ నేమ్స్ ఛేంజ్ ...ఈ మాటలు వినగానే ఠక్కున గుర్తొచ్చే పేరు కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావులోని టాలెంట్ ను గుర్తించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కోటలో ఉన్న ఈజ్ ను.. టైమింగ్ ను అద్భుతంగా వాడుకున్నాడు. మనీ మూవీలో కోట చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.
కంకిపాడు డాక్టరు గారబ్బాయి శ్రీనివాసరావు. డాక్టరవుదామనుకుని కష్టంలే అని గ్రాడ్యుయేటై..ఆనక బ్యాంకు ఎంప్లాయిగా స్థిరపడ్డాడు. కానీ లోపల తపనతో.. డ్రామాల్లో నటిస్తూ...అట్నుంచి సినిమాల్లోకి వచ్చేశాడు. అందరికీ పెడతాండా దణ్ణం అంటూ ప్రతిఘటన సినిమాలో కాశయ్యగా పాపులర్ అయిన కోట కొత్త తరహా విలనీ ఆవిష్కరించాడు.
పాత్ర ఏదైనా గెటప్ తో సహా అందులోకి పరకాయప్రవేశం చేసి సదరు కారక్టర్ లో బిహేవ్ చేసేస్తాడు కోట. అందుకే కొన్ని సినిమాలు కోట శ్రీనివాసరావు మీదే సక్సస్ కొట్టేస్తాయి. అంత మాత్రాన దాన్ని గర్వంగా ఫీలవడు. ప్రధానంగా ఆయన విలన్ గా నటించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేశాయి. విలనీలో ఆ మూల నుంచి ఈ మూల వరకు మొత్తం ఇరగదీసేశాడు. అదే టైమ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సత్తా చాటాడు. అసలు కారక్టర్ లోకి దూరితే సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో అహనా పెళ్లంట చూస్తే అర్ధమౌతుంది.
విలనీయే కాదు...కామెడీ చేయడంలోనూ కోట పవర్ ఫుల్లే. తను తొణక్కుండా కూల్ గా డైలాగ్స్ పేల్చి ఆడియన్స్ ను అవాక్కయ్యేలా చేస్తాడు కోట. తను చేస్తున్న పాత్రను డైరక్టర్ ఎలా ఊహిస్తున్నాడో ముందు ఆకళింపు చేసుకుంటారు కోట శ్రీనివాసరావు. ఇక ఆ తర్వాత చెలరేగిపోతారు. ముఖ్యంగా ఎమోషన్స్ కు అవకాశం ఉన్న పాత్ర అయితే ఇక చెప్పనవసరం లేదు.ఒక్క హీరో పాత్ర తప్ప అన్ని రకాల పాత్రలూ చేసి మెప్పించారు కోట శ్రీనవాసరావు. టిపికల్ మేనరిజంతో ఒక పాత్రను ప్రవేశపెట్టాలంటే.. దర్శకులకున్న ఏకైక ధైర్యం మన దగ్గర కోట శ్రీనివాసరావు ఉన్నాడనే.
నాగభూషణం...రావుగోపాల్రావు...నూతన్ ప్రసాద్ ఇదీ వరస. అంతకు ముందు సిఎస్ఆర్...డైలాగుల్తో ఆడుకున్న నటులు వీళ్లు. వారి తర్వాత ఆ స్థాయి కోట శ్రీనివాసరావుదే అని చెప్పాలి. నటుడుగా కోటది ఎవరూ అందుకోలేని ఎత్తు. గుండెల్ని పిండేసే కష్టాలెదురైనప్పుడూ...నిలబడనీయని సంతోషం ముంచెత్తినప్పుడూ కూడా ఒకేలా ఉండగలవాడు కోట శ్రీనివాసరావు. అలాంటి మహా నటుడి మహాభినిష్క్రమణం వేళ ఆయనకు నివాళి చెబుదాం..
- బాబురావు. కామళ్ల