అనుష్క శెట్టి నటించిన మూవీ ఘాటీ. ఈ సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై ఇప్పటి వరకూ ఎలాంటి అంచనాలూ బిల్డ్ కాలేదు. అసలు ఈ మూవీ వస్తుందన్న విషయం కూడా మెజారిటీ ఆడియన్స్ కు తెలియదు అంటే అతిశయోక్తి కాదు. అంత తక్కువ బజ్ ఉంది ఈ చిత్రంపై. తమిళ నటుడు విక్రమ్ ప్రభు .. అనుష్కకు జోడీగా నటించాడు. ఆంధ్రా, ఒరిస్సా బార్డర్ లో కొందరు ఆదివాసీలతో గంజాయి పండించి, దాన్ని సొమ్ము చేసుకుంటోన్న కొందరు అక్రమ వ్యాపారులకు ఎదురు తిరిగి తమ ప్రాంతంలో గంజాయి లేకుండా చేసిన ఓ ధీరవనిత కథగా ఈ చిత్రం గురించి చెప్పారు. ట్రైలర్ ఆకట్టుకునేలానే ఉంది. అయితే సినిమాపై అంచనాలు పెరగాలంటే ప్రమోషన్స్ కావాలి. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఓ రేంజ్ లో ఈవెంట్స్ చేసి, ప్రమోషన్స్ నిర్వహిస్తేనే పెద్దగా పట్టించుకోవడం లేదు ఆడియన్స్. అలాంటిది ఎప్పుడో ఫామ్ కోల్పోయిన అనుష్క సినిమాపై క్రేజ్ ఉంటుందంటే కష్టమే అని చెప్పాలి.
ఇక ఈ మూవీకి సంబంధించి హీరోతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. కానీ అతను తెలుగు ఆడియన్స్ కు పెద్దగా తెలిసిన వాడు కాదు. విలన్ గా నటించిన చైతన్య రావు సైతం సినిమాకు ఓపెనింగ్స్ తెచ్చేంత క్రేజ్ ఉన్నవాడు కాదు. అతని చేతా ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారు. సో.. ఈ మూవీకి హైలెట్ అయిన అనుష్క రంగంలోకి దిగితే తప్ప సినిమాపై బజ్ స్టార్ట్ కాదు. చూస్తుంటే అనుష్కకు ఘాటీ ప్రమోషన్స్ పై ఏమంత ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదు. తను లావు అవడం కారణంగా ప్రమోషన్స్ కు రావడం లేదా లేక తమిళ్ బ్యూటీ నయనతారలాగా ప్రమోషన్స్ కు రాను అని ముందే అగ్రిమెంట్ చేసుకుందా అనేది తెలియదు.
ఇక ఘాటీ దర్శకుడు క్రిష్ తో అనుష్కకు మంచి ‘టర్మ్స్’ ఉన్నాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన వేదం చిత్రం అనుష్క నటనకు అద్దం పట్టింది. ఈ మూవీకి బెస్ట్ యాక్ట్రెస్ గా అనుష్కకి, డైరెక్టర్ గా క్రిష్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఏదేమైనా ప్రమోషన్స్ స్టార్ట్ అయితే కానీ ఘాటీపై అంచనాలు మొదలు కావు.